ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటిం చిన చిరంజీవి కీలక ప్రకటన చేసారు. ఏపీలో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్దించారు. అనకాపల్లి, పెందుర్తి కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ ను గెలిపించాలని కోరారు. వారికి తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటాన్ని చిరంజీవి స్వాగతించారు. ఇది మంచి పరిణామం అని అన్నారు. చాలా కాలం తర్వాత ఇప్పుడే రాజకీయాలపై మాట్లాడుతున్నా.. దానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కల్యాణ్ అని చిరంజీవి చెప్పారు. సీఎం రమేష్‌కు కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. పంచకర్ల రమేశ్ నా ఆశీస్సులతో రాజకీయంగా అరంగేట్రం చేశారని గుర్తు చేశారు.


