ఏపీ రాజకీయాలు వేసవిని మించి హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార, విపక్షాల మధ్య ప్రతి అంశం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. తాజాగా రాష్ట్ర రాజకీయం అంతా ఇప్పడు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. వాలంటీర్లపై చంద్రబాబు కురిపించిన హామీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య చిన్న పాటి యుద్ధమే నడుస్తోంది.
మండు వేసవిలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రతి అంశం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. తాజాగా ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయం అంతా వాలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉండడంతో వారి ఓట్లతో పాటు వారు ప్రభావితం చేసే ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అందుకే అన్ని పార్టీలు ఇప్పుడు వాలంటీర్ జపం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్నాళ్లూ వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికల హామీతో ఎనలేని ప్రేమను కురిపించండంతో రాజకీయంగా మరింత హీట్ పెరిగింది.
తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. వేతనాన్ని రెట్టింపు చేస్తూ 10 వేలకు పెంచుతామని చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇవ్వడంతో రాజకీయ రగడ మొదలైంది. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. వాలంటీర్లను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. 2,66,000 మంది వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు. వాలంటీర్లు జగన్ ను నమ్మి మోసపోవద్దని చంద్రబాబు చెప్పారు.అయితే వాలంటీర్లపై చంద్రబాబు ఎన్నికల వరాలు కురిపించడంతో అటు వైసీపీ నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. వైసీపీ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. వాలంటీర్లకు చంద్రబాబు 10 వేలు ఇస్తామని అనడంపై జగన్ ఫైర్ అయ్యారు. ఈ విధంగానైనా జగన్ పాలన బాగుందని బాబు ఒప్పుకున్నారని అన్నారు. ఇన్నాళ్లూ లంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు వారికి రూ.10 వేలు ఇస్తామంటున్నారని ఆయన తెలిపారు. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుందంటూ జగన్ ప్రశ్నించారు.
ఇక వాలంటీర్ల విషయంలో బాబు వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటి వరకూ వాలంటీర్లపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్కసారిగా వారిపై ప్రేమ కురిపించడంలో ఏమైనా అర్థముందా అని ప్రశ్నించారు. వాలంటీర్లకు తాము అధికారంలోకి వస్తే పది వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో పాటు లక్ష రూపాయలు సంపాదించుకునేలా చేస్తానని చెప్పడం ఎన్నికల జిమ్మిక్కేనని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసేద్దామని అన్న చంద్రబాబు మాటలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారన్నారని సజ్జల ఆరోపించారు.మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు వాలంటీర్లు చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటు వైసీపీ నేతలు ఏమో వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తుంటే.. అటు చంద్రబాబు ఏమో వాలంటీర్ల జీతం పెంచుతామని బంపరాఫర్‌లు ప్రకటిస్తున్నారు. మరి వాలంటీర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.


