తెలంగాణలో ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కేసీఆర్ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారాయి. కేసీఆర్ నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. . ఉద్యమ పార్టీగా పేరొందిన భారత్ రాష్ట్ర సమితి గతంలో అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. అయితే ఎప్పుడు సంక్షోభాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ జనంలోకి దూసుకెళ్లింది గులాబీ పార్టీ.
పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కేసీఆర్ నాయకత్వానికి ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు సవాల్ విసురుతున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా అనేకసార్లు దెబ్బతిని, మళ్లీ ఫీనిక్స్ పక్షిలా ఎగిరింది. అటు కేంద్రంలోనూ ఇటు అనేక రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. సహజంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జాతీయ పార్టీలు విఫలమైన ప్పుడే…ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తాయి. ప్రాంతీయ పార్టీలకు ఒక పునాది ఉంటుంది. సైద్దాంతిక బలం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడు ద్రవిడ పార్టీలు ..ఇలా ఆవిర్భవించివనే. అయితే ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతానికి కట్టుబడ్డ కార్యకర్తలు ఉంటారు. ప్రస్తుతం ఈ కార్యకర్తలపైనే ఆశలు పెట్టుకున్నారు కేసీఆర్.
లోక్‌సభ ఎన్నికలు తరుముకువస్తున్న నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కొరుగా బడా బడా నాయకులు బయటకు వెళుతున్నారు. ఎంపీ టికెట్లు ఇస్తామని పోటీ చేయడానికి నాయకులెవరూ ముందుకు రావడం లేదు. కడియం కావ్య లాంటివారు బరిలో నిలబడి కూడాచివరి క్షణంలో పోటీనుంచి వైదొలగుతున్నట్లు తెగేసి చెప్పారు. కే. కేశవరావు, కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ లో పెద్ద పెద్ద పదవులు అనుభవించినవారే. అయితే ఇవాళ వారెవరూ పార్టీలో లేరు. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. ఒకరో ..ఇద్దరో నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన బలహీనపడే పార్టీ కాదు భారత్ రాష్ట్ర సమితి. అయితే లోక్‌సభ ఎన్నికలు ముగిసేనాటికి అసలు గులాబీ పార్టీయే ఖాళీ అవుతుందన్న ప్రచారం నడు స్తోంది. కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ఈ ప్రచారం జోరుగా నడుస్తోంది.ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటే, అది కేటీఆర్ లేదా హరీశ్ రావు వల్లనో అయ్యే పనికాదు.సాక్షాత్తూ భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ యే రంగంలోకి దిగాలి. పార్టీ నాయకుల్లో భరోసా కల్పించాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మనో ధైర్యం ఇవ్వగలగాలి.
లోక్‌సభ ఎన్నికల్లో ఒకరితో కాదు . ఒకే సమయంలో ఇద్దరు ప్రత్యర్థులతో గులాబీ పార్టీ యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇటు అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీ, అటు మరో ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ , ఈ రెండిటితో పోరాటం చేయాల్సి ఉంది గులాబీ పార్టీ. ఒకవైపు ఇతర పార్టీల నుంచి నాయకులు ఒక్కొక్కరి గా వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. దీనికితోడు గేట్లు ఎత్తేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన, గులాబీ పార్టీలో అసంతృప్తవాదులను రెచ్చగొట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీ,లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటడానికి తహతహలాడుతోంది. మరోవైపు బీజేపీ ఈసారి దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణపై భరోసా పెట్టుకుంది.మొత్తం 17 నియోజకవర్గాలను టార్గెట్‌గా పెట్టుకుంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు తెలంగాణ నేతలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే త్వరలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన వైఖరికి భిన్నంగా ఈసారి జనం దగ్గరకు వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. బస్సు యాత్రలు, బహి రంగ సభలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నాలుగు నెలల కాలంలో వ్యవసాయ, పారిశ్రామికవర్గాలు ఎలా నిర్వీర్యమయ్యాయి? కరవు పరిస్థితిని ఎదుర్కోవ డంలో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసే అవకాశాలున్నాయి. అంతేకాదు, గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను ఎలా చిన్నచూపు చూస్తుందో, సమాఖ్య స్ఫూర్తిని ఎలా దెబ్బతీస్తుందో ! తెలంగాణ సమాజానికి కేసీఆర్ వివరించనున్నారు. కాగా కేసీఆర్ ఇటీవల చేపట్టిన పొలంబాట కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ రైతాంగం తమ వెంటే ఉందని కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు. అధికారం పంచుకున్న నాయకులు వెళ్లిపోయినా, క్షేత్ర స్థాయిలో సుశిక్షితులైన కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. ఏమైనా గులాబీ పార్టీని గాడిలో పెట్ట డానికి కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు.


