ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీల్లో కీలకమైనది ప్రత్యేకహోదా అంశమే. ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రత్యేకహోదా కల్పిస్తామని లోక్‌సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకహోదా అంశానికి మద్దతు ఇచ్చింది.
విభజన జరిగి దాదాపు పదేళ్లు గడుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడల్లా అది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం చాలా సార్లు తేల్చి చెప్పింది. ఇక విభజన చట్టంలేని అనేక అంశాలను ఈపాటికే అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేంద్రం సన్నాయి నొక్కులు కూడా నొక్కింది. ఒక్కమాటలో చెప్పాలంటే ….అన్నీ ఇస్తాం కానీ….ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఇప్పటివరకు వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. అయితే కావాలంటే ఏమైనా ఇస్తాం కానీ, ప్రత్యేకహోదా అనే ముచ్చటే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
విభజన తరువాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం పాటు ప్రత్యేకహోదా అంశం చుట్టూనే రాజకీయాలు నడిచాయి.2014 ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకహోదా సాధించడం సవాల్ గా మారింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా ప్రత్యేకహోదా అంశంపై చంద్రబాబు సర్కార్‌ను నిలదీసింది. అంతేకాదు స్పెషల్ స్టేటస్ అంశంపై ప్రజల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. ఆ తరువాతి పరిణామాలు అందరికీ తెలిసినవే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ అంగీకరించలేదన్నది వాస్తవం. ఈ విషయం ప్రజల్లోకి కూడా వెళ్లింది.
ఇదిలా ఉంటే పొయ్యి సెగ పొంతకు తగిలినట్లు బీజేపీ మీద ప్రజల వ్యతిరేకతను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ,జనసేన భరించాల్సి వస్తోంది. ప్రజల వ్యతిరేకత ఇప్పుడు కేవలం బీజేపీకే పరిమితంకాదు. కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద కూడా పడుతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశం కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమికి మైనస్ పాయింట్‌గా మారుతోంది. అనేకానేక త్యాగాలు చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్నారు ఆంధ్రులు. ఈ సందర్భంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నివాదాన్ని ప్రస్తావించుకుని తీరాలి. అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నష్టాలు వస్తున్నాయన్న కారణం చూపించి, నడిబజారులో అమ్మకానికి పెట్టింది కేంద్రంలోని బీజేపీ సర్కార్. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉత్తరాంధ్ర భగ్గున మండింది. రోజుల తరబడి ఆందోళనలు చేసింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలను ఉక్కు ఫ్యాక్టరీ అంశం దెబ్బతీస్తుందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రకటనలు చేయడమే తప్ప నిర్మాణాత్మకంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్న విషయం జనంలోకి వెళ్లింది. టోటల్‌గా ఈ అంశాలన్నీ తెలుగుదేశం పార్టీ కూటమి విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే వాలంటీర్ల వ్యవస్థపై వేసిన తప్పటడుగు తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతినెలా పెన్షన్‌లు తీసుకునే వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఇతరులు కలిపి దాదాపు 66 లక్షల మంది ఉన్నారు. వీరందరి ఇళ్లకు ప్రతి నెలా ఒకటవతేదీన తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు వెళతారు. పెన్షన్‌కు సంబంధించిన సొమ్మును వారి చేతుల్లో పెడతారు. ఇది చాలా కాలం నుంచి నడుస్తున్న ప్రక్రియ. ఈ ప్రక్రియ పెన్షన్‌దారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షనర్లకు వాలంటీర్లు నగదు అందచేసే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా వాలంటీర్ల సేవలపై ఎలక్షన్ కమిషన్ విధించిన ఆంక్షలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. అవ్వాతాతయ్యలకు సకాలంలో పెన్షన్ అందకపోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతే కారణం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. పెన్షనర్ల సానుభూతి పొందడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాలు పన్నింది. పనిలో పనిగా పల్లె ప్రజలకు సేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై నిప్పులు చెరిగింది తెలుగుదేశం పార్టీ.
వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తాము తీసుకున్న వైఖరి మిస్ ఫైర్ అవుతుందన్న విషయం చంద్రబాబు గ్రహించారు. ఇంకేముంది…వెంటనే ప్లేట్ ఫిరాయించారు. వాలంటీర్ల వ్యవస్థకు తాను వ్యతిరేకం కానని చంద్రబాబు వివరణ ఇచ్చుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. వాలంటీర్లను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామంటూ చంద్రబాబు మాటమార్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమ విజయావకాశాలు మెరుగుపడతాయని మొదట్లో తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలే ఇప్పుడు తమ కూటమికి మైనస్ పాయింట్లు అవుతాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో పసుపు పార్టీ ఓడిపోతే, ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో సందడి చేస్తున్నాయి.


