భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో మైనర్ బాలిక గర్భవతి అయి సంఘటన
మరో మైనర్ బాలిక గర్భవతి అయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మర్కోడు ఏజెన్సీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మైనర్ బాలికకు కడుపునొప్పి రావటంతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో తల్లిదండ్రులు చేర్పించారు. బాలికకు ఆసుపత్రిలో నిర్వహించిన స్కానింగ్ పరీక్షలో ఆమె గర్భవతి అయిన విషయం బయటపడింది. వరసకు ఆమె బావే గర్భానికి కారణం అని తెలియడంతో తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం ఆ మైనర్ బాలిక ఐసీడీఎస్ పర్యవేక్షణలో ఉంది.
గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో సందడి చేసిన టాలీవుడ్ హీరో నవదీప్
గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు సినీ హీరో నవదీప్ సందడి చేశారు. తాను నటించిన లవ్ మౌళి సినిమా ఏప్రిల్ 19న రిలీజ్‌కి సిద్ధమవుతుండడంతో చిత్రం యూనిట్ ప్రమోషన్‌లో వేగం పెంచింది. ఈ సందర్భంగా నవదీప్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. యదార్థ సంఘటన ఆధారంగా తీసిన లవ్ మౌళి సినిమాను ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన వ్యక్తి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాను ఆదరిం చాలని నవదీప్ కోరారు.
కామారెడ్డి జిల్లా బండరామేశ్వరపల్లి రేషన్ బియ్యంలో పలుగు రాళ్లు
కామారెడ్డి జిల్లా బండరామేశ్వర్‌పల్లిలో రేషన్ బియ్యంలో పలుగురాళ్ళు రావడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లతోపాటు ముక్కిన బియ్యం రావడంతో వారు ఆందోళన చెందారు. నాణ్యమైన బియ్యం ఇవ్వకపోతే మానుకోవాలని మండిపడ్డారు. ముక్కిన బియ్యం తీసుకోకుండా చౌకధర దుకాణం డీలర్ పై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత స్కీములు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. నాణ్యత లేని సరుకులు సరఫరా చేసి, పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. దీంతో చౌకధరల దుకాణానికి డీలర్ తాళం వేసి వెళ్లిపోయాడు.
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పలమనేరు డీఎస్పీ ఉమా మహేశ్వర్‌రెడ్డి
ఎన్నికల సమయంలో రౌడీషీటర్లకు చిత్తూరు జిల్లా పలమనేర్ డీఎస్పీ ఉమామహేశ్వర్‌రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. పలమనేరు, గంగవరం పరిసర ప్రాంతాల్లో రౌడీషీటర్లుగా ఉన్న వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రౌడీషీటర్లకు డీఎస్పీ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని మండలాల్లో అయినా, గ్రామాల్లో గానీ రౌడీషీటర్లు, పార్టీలు దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఉమామహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లాలో జోరుగా బీజేపీ ప్రజా ఆశీర్వాద యాత్ర
ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి..వికారాబాద్ జిల్లా మున్నూర్ సోమరం గ్రామంలో పర్యటించారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరబోతుందన్నారు. కాంగ్రెస్ చెబుతున్న ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రం లో అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినా కూడా ప్రజలకు ఒక్క హామీ అమలు చేయలేదని విమ ర్శించారు విశ్వేశ్వర్ రెడ్డి. గ్రామాల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.


