రాజ్యసభ నుంచి ఇవాళ, రేపు మొత్తం 54 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తోపాటు 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో కొందరు మళ్లీ ఎగువ సభకు వచ్చే అవకాశం లేదు. రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్ మన్మోహన్‌సింగ్ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం ఇవాళ్టితో ముగియనుంది. ఆర్థికవ్యవస్థలో పలు సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్‌సింగ్ 1991 అక్టోబరులో మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసి, 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు దేశ ప్రధానిగా సేవలందించారు. మన్మోహన్ ఖాళీ చేయనున్న స్థానంలో ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తొలిసారిగా పార్లమెంటు ఎగువసభలో అడుగుపెట్టనున్నారు.
కేంద్ర మంత్రుల్లో ధర్మేంద్ర ప్రధాన్ , మన్‌సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, రాజీవ్ చంద్రశేఖర్ , వి.మురళీధరన్ , నారాయణ రాణె , ఎల్.మురుగన్ ల రాజ్యసభ పదవీకాలం ఇవాళ్టితో ముగిసింది. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ , అశ్వినీ వైష్ణవ్ ల పదవీకాలం రేపటితో ముగియ నుంది. ఈ 9 మందిలో అశ్వినీ వైష్ణవ్ మినహా మిగతా 8 మంది తాజా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా రు. వైష్ణవ్, మురుగన్‌లకు రాజ్యసభ సభ్యులుగా మరో అవకాశం ఇచ్చారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయాబచ్చన్‌కు సైతం ఆ పార్టీ మరో అవకాశం ఇచ్చింది.
పదవీ విరమణ పొందనున్న 54 మంది రాజ్యసభ సభ్యుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ జాబితాలో ఉండగా.. తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగ య్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర రిటైర్డ్ కానున్నారు. ఇందులో బీఆర్‌ఎస్‌కు చెందిన వద్దిరాజు రవి చంద్ర మళ్లీ ఎన్నికయ్యారు.