పండక్కి రైలు టిక్కెట్టు దొరకలేదా? అయితే కంగారుపడకండి, టెన్షన్ అసలే పడకండి. హాయిగా ఎంచక్కా ఏపీఎస్ ఆర్టీసీ బస్సెక్కి వెళ్లండి…ఎందుకంటే ఇప్పుడు ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రైవేటు బస్సుల దోపిడీ నుంచి రక్షించింది. గతంలో అయితే పండుగకి 50 శాతం అదనంగా వసూలు చేసేది. దానిని ఇప్పుడు రద్దు చేసింది. యథాతథ టిక్కెట్టు ధరతోనే మిమ్మల్ని క్షేమంగా గమ్యస్థానాలకు తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యింది.
ఉన్న బస్సులకు తోడు అదనంగా 6,400 బస్సులను ఏర్పాటు చేసింది. ఈనెల 6 నుంచి బస్సులు మొదలవుతాయి. జనవరి 14 వరకు 3,120 బస్సులు, పండగ తర్వాత తిరిగి వెళ్లేవాళ్లకి అంటే 15 నుంచి 18 వరకు 3,280 బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో ఏ ఒక్క ప్రయాణికుడు కూడా ఇబ్బంది పడకుండా హాయిగా, క్షేమంగా పండగకి ఇంటికి చేరేలా ఆర్టీసీ విస్త్రత ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి 3600 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 800 బస్సులు, విశాఖపట్నానికి 450, రాజమహేంద్రవరానికి 200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 65శాతం టిక్కెట్లు బుక్ అయినట్టు ఆర్టీసీ తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఉండటంతో రిటర్న్ టికెట్లను కూడా చాలామంది తీసుకుంటున్నారని తెలిపింది.
ఇకపోతే ఒకేసారి ఐదు టిక్కెట్లు తీసుకుంటే 5శాతం రాయితీ ఇస్తామని, రానుపోను టిక్కెట్లు తీసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని ఆర్టీసీ మరొక బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించడంతో ప్రయాణికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు రాయితీలు యథాతథంగానే ఉన్నాయని తెలిపారు. ఇంతకుముందు తీసుకునేవారు, ఇప్పుడు తిరిగి ఇస్తున్నారని అంటున్నారు.
కేవలం ప్రైవేటు ట్రాన్స్ పోర్టు, ప్రైవేటు ట్యాక్సీల నిలువుదోపిడీ నుంచి ప్రజలను రక్షించేందుకు నడుం బిగించిన ఆర్టీసీపై సర్వత్రా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి పండుగకి ఇంటికి వచ్చి తిరిగి మళ్లీ గమ్యస్థానాలు చేరాలంటే, ఆ కష్టాలు, ఆ ధరలతో పండగ ఆనందమంతా ఆవిరైపోయేదని అందరూ బాధపడేవారు. ప్రైవేటు బస్సుల్లో డిమాండ్ ని బట్టి ఒక టిక్కెట్టు రూ.2వేల నుంచి రూ. 2,500 కూడా వసూలు చేసేవారని ప్రయాణికులు గగ్గోలు పెట్టేవారు.
భార్యాభర్త, ఇద్దరు పిల్లలు తిరిగి హైదరాబాద్ చేరాలంటే కేవలం వెళ్లేటప్పుడు మాత్రమే రూ.10వేలు పెడితేనే చేరే పరిస్థితుల ఉండేవని, ఆ పరిస్థితి నుంచి బయటపడ్డామని, ఎంతో ఆనందంగా ఉందని ప్రయాణికులు వ్యాక్యానిస్తున్నారు. ఇది కదా నిజమైన పండుగ అంటున్నారు.
ఈ మిగిలిన డబ్బులు తల్లిదండ్రులకి లేదా అక్కచెళ్లెళ్లకి సంక్రాంతి బట్టలు తీసేందుకు ఉపయోగపడతాయని ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఏపీఎస్ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో పండగకి ఇంటికివెళ్లే వాళ్ల గుండెల మీద పెద్ద భారం దిగినట్టయ్యిందని చెబుతున్నారు. పనిలో పనిగా జగనన్నకు థ్యాంక్స్ చెబుతున్నారు.