ఏపీలో పొత్తుల పంచాయితీ రసవత్తరంగా మారింది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు. నిన్న సమావేశమైన ఇరు పార్టీల నేతలు పొత్తులు, సెకండ్ లిస్ట్ పై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. బీజేపీతో చర్చలు పూర్తయ్యాకే రెండో జాబితా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై రెండు రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పొత్తుల అంశంలో దాగుడు మూతల కు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అమిత్ షాను చంద్రబాబు కలిసినప్పటి నుంచి పొత్తు ఉంటుందా? ఉండదా? అనే సంశయం ఇప్పటివరకు కొనసాగింది. ఆ మీటింగ్కు కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి అమిత్ షాను కలవబోతున్నారు. ఈ సమావేశంలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ పెద్దలతో భేటీ అనంతరం టీడీపీ లాంఛనంగా ఎన్డీయేలో చేరే అవకాశం ఉందా.. లేదా అనే దానిపై క్లారిటీ రానుంది. ఒకవేళ ఎన్డీయేలో టీడీపీ చేరితే… సీట్ల సర్దుబాటు గురించి ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారు.మరోవైపు నెక్ట్స్ లిస్ట్ పై బీజేపీ కోర్ కమిటీ ఇవాళ, రేపు సమావేశం కానుంది. ఈ సమావేశాల్లోనే ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అధిష్టానం పెద్దలతో పురందేశ్వరి, సోము వీర్రాజు సమావేశంకానున్నారు. నిన్న ఆశావహుల జాబితాను అధిష్టానానికి అందజేశారు.


