ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. అయితే ఏపీ రాజకీయాల్లో పొత్తుల పంచాయితీకి మాత్రం ఫుల్‌స్టాఫ్ పడడం లేదు. ఎన్నికలు టైం దగ్గరపడుతున్నా.. టీడీపీ-బీజేపీ పొత్తుపై అదే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపినా పొత్తుపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అదే సమయంలో టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే ఏపీలో పొత్తులపై ఒకటి రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది. ఇదే సమయంలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఇవాళ్టి నుంచి అసెంబ్లీ లోక్‌సభ అభ్యర్థులపై ఏపీ బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ముఖ్య నేతలు జిల్లా అధ్యక్షులతో పురందేశ్వరి వరుస సమావేశాలు నిర్వహిస్తు న్నారు. ఒక్కో స్థానానికి 3 అభ్యర్థులను ఎంపిక చేసి 3 రోజుల్లో ఢిల్లీకి పంపనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పొత్తులు లేకపోతే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం జరుగు తోంది. ఇప్పటికే అసెంబ్లీ టికెట్ల కోసం భారీగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ పెద్దల మదిలో ఏముందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..లేదా ఒంటరిగా పోటీ చేస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.