బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు కౌంటర్‌గా చలో పాలమూరు, రంగారెడ్డికి పిలుపునిచ్చింది అధికార కాంగ్రెస్. CWC మెంబర్ వంశీచంద్‌రెడ్డి సారధ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో సీఎం రేవంత్‌రెడ్డి మినహా మిగతా 11 మంది ఎమ్మెల్యేలు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ జరిగిన పనులు, వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకువెళ్లింది. పాలమూరు-రంగారెడ్డి పథకంలోనూ కమీషన్ల కోసం ఇష్టాను సారంగా అంచనాలు పెంచి డిజైన్ మార్చారని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే బీఆర్‌ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డకు కౌంటర్‌గా.. పాలమూరు ప్రాజెక్టును సందర్శించి అక్కడి లోపాలను ఎత్తిచూపేందుకు ఆ పార్టీ రెడీ అయింది.
అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి రైతుల పాదాలు తడుపుతామన్న కేసీఆర్ హామీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చెప్పిన అంశాలను, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందని అంశాన్ని ప్రజలకు వివరించాలని భావిస్తోంది. దీంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోటుపాట్లను, అక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో చలో పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.