34.2 C
Hyderabad
Monday, March 2, 2026
spot_img

మేడారం ఎప్పటికీ మారదా !

       ప్రకృతిని పూజించే భక్తుల పట్ల ప్రభుత్వాలకు పట్టింపు లేదా..? గద్దెలే గర్భ గుడిగా, కుంకుమ భరణే తల్లులుగా భావిస్తున్న ప్రజలకు ఎందుకిన్ని కష్టాలు..? మేడారం ఇంకా మేడి పండులాగే ఉండడానికి కారకులెవరు..? ఆసియా ఖండలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరపై ఎందుకంత నిర్లక్ష్యం..? ప్రభుత్వాలు మారిన భక్తుల ఇబ్బందులు ఎందుకు మారడం లేదు..? అసలు తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరలో ఏం జరుగుతోంది.

      ఏం మారింది… మేడారంలో ఏది మారింది.. అదే తీరు… అదే పోరు…దర్శనం చేసుకోవాలంటే గంటల కొద్ది అదే వ్యధ. బయట ఉండాలంటే అదే బాధ. త్రాగునీరు, వాడుకునే నీరు, మరుగుదొడ్లు అదే పరిస్థితి. టెక్నాలజీ మారుతు న్నా.. తల్లుల ఆదాయం పెరుగుతున్నా.. ఇంకా అప్పటి పరిస్థితే. ఎడ్ల బండ్ల నుండి హెలికాప్టర్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు వెళ్లే రోజులు వచ్చినా.. అక్కడ పరిస్థితులు మాత్రం ఇంకా మారడం లేదు. కాకులు దూరని కారడవిలో కోట్లాది మంది భక్తుల అవస్థలకు అడ్డుకట్ట పడడం లేదు. రెండేళ్లకోసారి వస్తున్న జాతర పట్ల రెట్టింపు అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. జాతర వస్తున్న సమయంలో కోట్లల్లో నిధులు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. నెల రోజుల ముందుగా రోడ్లు, త్రాగునీరు, స్నాన ఘట్టాలు, సానిటేషన్  పట్ల శ్రద్ధ చూపుతూ ప్రభుత్వాలు సవితి తల్లి ప్రేమను చూపుతు న్నాయే తప్ప శాశ్వత పరిష్కార మార్గాలు చూపడం లేదు. మరోవైపు మేడారంలో వీఐపీలకు, ప్రజాప్రతి నిధులకు, పోలీసులకు ఉన్న గౌరవం తల్లులను కొలిచే సామాన్య భక్తులకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతున్నా..భక్తులకు కష్టం ఎందుకు తీరడం లేదనే ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది.

     తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా భక్తులు తరలివచ్చి మేడారంలో తల్లులదర్శనం చేసుకుని వెన దిరిగి వెళ్తున్నారు. కానీ ఇక్కడి అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ప్రతీ సారి ఆదాయం పెరుగుతుందే తప్ప భక్తులు ఆశించిన అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. నిలువెత్తు బంగారాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చే భక్తుని తల్లుల దర్శనం నెమ్మదిగా కావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవే క్యూ లైన్లు. అవే చలువ పందిళ్లు. అవే దారులు తప్ప, వస్తున్న భక్తకోటి ప్రజలు కోరుకునే విధంగా తీరు మారకపోవడం పెద్ద ప్రశ్నగా నిలిచిపోయింది. ఎక్కడ చూసిన ట్రాఫిక్ ఇబ్బందులు, చాలీచాలని పార్కింగ్ స్థలా లు, గద్దెల వద్దకు చేరుకోవాలంటే కిలోమీటర్ల మేర నడక ప్రయాణంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు వచ్చాయని సంబర పడాలో, సామాన్య భక్తుడికి దర్శనం సమస్యగా మారినందుకు బాధపడాలో అర్ధం కాని పరిస్థితి మేడారంలో కనిపిస్తోంది.

       గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఐదు సార్లు మేడారం జాతర నిర్వహించింది. అప్పటి సీఎం కేసీఆర్ గద్దెలను విశాలంగా చేస్తామని, చుట్టూ ప్రక్కల పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హమీ ఇచ్చారు. క్యూ లైన్లు పెంచడంతో పాటు కోట్లాది మంది ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారాలు చూపిస్తామని ఊకదంపుడు ఉపనాస్యాలు చేసి వెళ్లిపోయారు. కానీ అక్కడి తీరు ఏ మాత్రం మారలేదు. ఇకపోతే అప్పటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయిన సీతక్క ఇప్పుడు ప్రస్తుత మంత్రి. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క తను ప్రాతినిధ్యం వమిస్తున్న నియోజకవర్గంలోని మేడారం మహా జాతరకు వంద కోట్ల మేర మాత్రమే నిధులు తీసుకువచ్చారు. అప్పుడు ప్రజల్లో ఉంటూ, భక్తులతో తిరుగుతూ ప్రతీ సమస్యను లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన సీతక్క.. ఇప్పుడు మాత్రం తల్లుల పూజా తంతుల్లో మాత్రమే పాల్గొం టున్నారని భక్తులు అంటున్నారు. అధికారులతో సమీక్షలు, ఫీల్డ్ విజిట్లు తప్ప భక్తుల ఇబ్బం దులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

      మరోవైపు మేడారం జాతరలో వీఐపీలకు, ఉన్నతాధికారులకు, పోలీస్ బాస్‌లకు పెద్ద పీట వేసినట్లుగా కనిపిస్తోంది. వారి కుటుంబాలకు దర్శనం కావాలంటే ఐదు నిమిషాల్లో పూర్తయ్యేందుకు అన్ని ఏర్పాటు చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేడారం గద్దెలకు పడమర వైపున ఉన్న మంచె వద్ద ఒక ట్రక్కును ఏర్పాటు చేసి అందులో ఏసీలని ఏర్పాటు చేసి సేదతీరేందుకు సౌకర్యంగా ఉంచుకున్నారు. ఇక జాతర మొత్తంలో పోలీసులది కీలక పాత్ర ఉంటుంది. వారు చెప్పిందే వేదం, ఎవరిని పంపించా లన్నా, ఎవరికి ఆపలన్నా వారి చేతిలోనే ఉంటుంది. నాలుగు రోజుల జాతర సందర్భంగా పోలీసులు వ్యవహరించే తీరు సామాన్య భక్తుడికి ఎంతో జుగుప్సా కరంగా ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. బంగారం కావాలన్న, అమ్మవారి చీరలు, గాజులు ఏదైతేనేం అన్నిట్లోను పోలీసుల పాత్ర అమో ఘం. ఇవన్నీ పట్టనట్లు ప్రభుత్వం, ఉన్నతాధికారులు వ్యవహరించే తీరు సైతం ఆలోచనాత్మకంగానే ఉంటుంది . వీటి పై ఎలాంటి శ్రద్ద చూపుతారో ఈ నాలుగు రోజుల జాతరలో వేచి చూడాలి.

    చివరగా ఒక్క మాట చెప్పుకోవాలి. మేడారం మహ జాతర అంటేనే ఇసుకేస్తే రాలనంతా జనం. ఎటు చూసిన జనప్రవాహం. ఇటు తాడ్వాయి నుండి కన్నెపెల్లి వరకు అటు చిలకలగట్టు నుండి నార్లపూర్ వరకు చుట్టూ దాదాపు 15 కిలో మీటర్ల మేర జనగూడారాలు, నిత్యం ప్రయాణించే వాహనాలే దర్శనమిస్తాయి. ఇంతటి మహ జారతకు ప్రభుత్వం ఎన్ని ఏర్పాటు చేసిన చాలవనే విషయం భక్తుల నుంచి వినిపిస్తోంది. జాతర సమయంలో మాత్రమే పనులు చేస్తూ, మిగత రెండు సంవత్సరాలు అటు వైపు కన్నెత్తి చూడని ప్రభుత్వాలను ఏమనాలి..? ఒక్క జంపన్నవాగు మినహ మిగతా చోట్ల అభివృద్ధి చేయడానికి అడ్డంకి ఏముందనే విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేడారం జాతర పట్ల ప్రత్యేక శ్రద్ద చూపి ప్రాంగణాన్ని విశాలంగా చేయడంతో పాటు క్యూ లైన్లలోని భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చూడాలి. ముఖ్యంగా సానిటేషన్, త్రాగునీరు పట్ల శ్రద్ద పెట్టి శాశ్వత పరిష్కార మార్గాలు కనిపెట్టాలి. ప్రకృతిని పూజిస్తున్న తెలంగా ణ ప్రజల నమ్మకాన్ని, ఆదివాసీల ఆచారాలను ప్రపంచానికి తెలిసేలా చేసినప్పుడే తెలంగాణ కుంభమేళ మేడారం జాతర సక్సెస్ అవుతుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్