సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది తెలంగాణ. అసెంబ్లీ ఎన్నికల పోరులో నువ్వా-నేనా అన్నట్లు తలప డిన అన్ని పార్టీలూ.. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ ఢీ అంటే ఢీ అనేం దుకు రెడీ అయ్యాయి. అయితే. . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నా… ఆ ఒక్క సీటంటే మాత్రం అందరూ మాకంటే మాకేనని పోటీపడుతు న్నారు. ఇంకా చెప్పాలంటే ఇతర అన్ని స్థానాల కంటే ఆ పార్లమెంటు స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ ఎంపీ స్థానం ఏంటి ? అన్ని సీట్లు ఉన్నా.. మెజార్టీ నేతలు ఎందుకు ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు? స్థానికులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన నేతలు సైతం ఆ సీటుపై దృష్టి పెట్టడానికి కారణమేంటి ?
లోక్‌సభ ఎన్నికల కోసం నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి తెలంగాణలోని అన్ని పార్టీలు. ఓవైపు దేశవ్యా ప్తంగా మోడీ గాలి బలంగా వీస్తోందని చెబుతున్న బీజేపీ నేతలు… రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు దక్కించుకొని కేంద్రంలో కమలం జెండా మరింత రెపరెపలాడేందుకు తమవంతు సాయం చేయాలని స్థానిక నేతలు భావిస్తున్నారు. తద్వారా హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక, పదేళ్ల పాటు కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు.. మంచి ఊపు నిచ్చింది. దీంతో.. 13 నుంచి 14 లోక్‌సభా స్థానాలు రేవంత్ నాయక త్వంలో సాధించి…ఇండియా కూటమి ఢిల్లీ గద్దె ఎక్కేందుకు సాయపడాలని భావిస్తున్నారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి బదులు తీర్చుకోవాలని యోచిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు.
ఈనెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు నేతలంతా. అయితే…ఈ క్రమంలోనే అందరి దృష్టీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న స్థానం మల్కాజ్‌గిరిపై పడింది. భిన్న సంస్కృతులకు నిలయంగా ఉంది ఈ ఎంపీ సీటు. దీంతో.. ఇక్కడి ప్రజల తీర్పు ఎప్పుడూ విభిన్నమే. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఏర్పడింది మల్కాజ్గిరి ఎంపీ స్థానం. దీని పరిధిలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, మేడ్చల్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా దేశం లోని ఇతర ప్రాంతాలకు చెందిన వారూ ఉంటున్నారు. దీంతో… ఈ పార్లమెంటు స్థానాన్ని మినీ భారత్‌గా అభివర్ణి స్తుంటారు. ఈ పార్లమెంటు స్థానం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా… రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీని ఆదరించారు ఇక్కడి ఓటర్లు. మొన్నటి 2019 లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు.
ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతో మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం గట్టి పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పలువురు ప్రముఖ నేతలు టికెట్ దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. ఆయా పార్టీల అధిష్టానాల వద్ద తమకు ఉన్న పలుకుబడి ఉపయోగించి టికెట్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎంపీ సీటు కోసం పోటీపడు తున్న బీజేపీ నేతల ఎవరన్నది ఓసారి పరిశీలిస్తే… కమలం పార్టీకి చెందిన సీనియర్లు ముందు వరుసలో ఉన్నారు. ఈటల రాజేందర్, కూన శ్రీశైలం గౌడ్, మురళీ ధర్‌రావు, చాడ సురేష్ రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ కొమురయ్య, పన్నాల హరీష్ రెడ్డి, సామ రంగారెడ్డి సహా మరికొందరు విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర నేతల్లో సీనియర్‌గా ఉన్న ఈటల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారైనా, అక్కడ ఎంపీ స్థానం నుంచి బండి సంజయ్ ఉండడంతో ప్రత్యామ్నాయంగా మల్కాజ్‌గిరిపై దృష్టి సారించారు. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి ఈటల పలుమార్లు తీసుకెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. ఇక, కుత్బుల్లాపూర్‌కు చెందిన శ్రీశైలం గౌడ్ స్థానికంగా తనకు ఉన్న పట్టుతోపాటు ప్రజల్లో తనపై ఉన్న సానుభూతి, క్రేజ్ దృష్ట్యా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక, గత కొంత కాలంగా స్థానిక కేడర్‌తో మమేకమవుతున్న పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు సైతం చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. మరి… బీజేపీ అధినాయకత్వం ఎవరికి సీటు ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
హస్తం పార్టీ నుంచి సైతం మల్కాజ్గిరి సీటు కోసం విపరీతమైన పోటీ నెలకొంది. భారీ సంఖ్యలో ఆశావహులు దీనిపై దృష్టి సారించారు. ఇందుకు ప్రధాన కారణం.. ఇది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ లోక్‌సభా స్థానం కావడమే. ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీనికి తోడు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసి అధికారాన్ని హస్త గతం చేసుకుంది. దీంతో… ప్రభుత్వ పరంగా ఉండే అనుకూలతను ఆసరాగా చేసుకొని ఎంపీ సీటును గెల్చుకోవాలని కాంగ్రెస పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బండి రమేష్, కుసుమ కుమార్‌తోపాటు ఇటీవలె పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్, చంద్రశేఖర్ రెడ్డి సైతం తమకు అవకాశం కల్పంచాలని పార్టీని కోరుతున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా కర్చీఫ్ వేశారు. వీరందరితోపాటు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. మరి.. ఎన్నికల నాటికి ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తి రేపుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్… మెజార్టీ ఎంపీ స్థానాలను దక్కించుకునే అంశంపై గురి పెట్టింది. పైగా జంట నగరాల పరిధిలో ప్రత్యేకించి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న సీట్లన్నింటిలో గులాబీ పార్టీ నేతలే జయకేతనం ఎగుర వేయడంతో పార్లమెంటు స్థానంలో గెలవడం చాలా సులువని భావిస్తున్నారు. దీంతో…పలువురు పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రధానంగా ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇటీవలె బీఆర్ఎస్లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ కూడా తమ కుటుంబంలో ఎవరైనా ఒకరికి ఈ సీటు కేటాయించాలని కోరుతున్నా రు. అయితే, బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం మాజీ మంత్రి మల్లారెడ్డికే ఛాన్సివ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగు తోంది. అదే సమయంలో ఊహించని విధంగా కొత్త అభ్యర్థినైనా బరిలో దింపవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఇంకా ఏ పార్టీ కూడా పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. దీంతో.. ఎవరికి వారు తమ స్థాయిలో లాబీయింగ్చేస్తున్నారు. అంతేకాదు.. ఒకవేళ తాము కోరుకున్నట్లుగా మల్కాజ్గిరి ఎంపీ సీటు దక్కకపోతే.. అవసరమైతే కండువా మార్చైనా సరే… టికెట్ దక్కించుకోవాలని భావిస్తున్నారు. మరి.. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఎవరికి మల్కాజ్గిరి ఎంపీ సీటు దక్కుతుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.