మనదేశంలో ఆర్థిక, సామాజిక న్యాయం కోసం జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలని దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కుల ఆధారిత జనగణన చేయడానికి ముందుకు రాలేదు. బ్రిటిష్ పాలనాకాలంలో 1881 నుంచి 1931 వరకు ఆరుసార్లు జనాభా లెక్కల సేకరణ జరిగింది. అయితే ఈ ఆరుసార్లూ కుల ఆధారితంగానే జనాభా లెక్కల సేకరణ జరిగింది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1951 నుంచి 2011 వరకు మొత్తం ఏడు సార్లు జనాభా లెక్కల సేకరణ జరిగింది. అయితే కుల ఆధారిత జనగణన చేయడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వాలు ఏవీ ముందుకు రాలేదు.
వెనుకబడిన తరగతుల ప్రయోజనాల దృష్టితో చూస్తే, కులగణన అనేది చాలా ముఖ్యమైన అంశం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి కులగణన ఉపయోగపడుతుంది. అంతేకాదు, కొత్త పథకాల రూపకల్పనకు సైతం కులగణన దోహదపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో కూడా బీసీ వర్గాల కు కులగణన సహాయపడుతుంది. వాస్తవానికి దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతు లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జరగాలన్నా కులాలవారీగా జనాభాను లెక్కించి తీరాల్సిన అవసరం ఉంది. బీసీల నాయకత్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి. కులాలవారీ గా లెక్కలు లేనట్లయితే తమ మేలు కోసం తీసుకువచ్చే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులు ఉంటాయం టున్నారు బీసీ వర్గాల నేతలు.వాస్తవానికి దేశ జనాభాలో కులపరంగా, ఆర్థికంగా, చదువుపరంగా వెనుకబడిన కులాలు 52 శాతం ఉంటార న్నది ఒక అంచనా. వీరికి కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాల ని మండ ల్ కమిషన్ గతంలోనే సిఫార్సు చేసింది. 1931లో చివరిసారిగా జరిగిన కులగణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది. అప్పటి నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయా న్ని కచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్ బలంపుంజుకొంది. అయినా 2001,2011 సెన్సస్‌లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీక రించలేదు.
దేశవ్యాప్తంగా కులగణన జరగకపోవడంతో వెనుకబడిన తరగతులు నష్టపోతున్నాయి. కులాలవారీ జనాభా లెక్కలపై స్పష్టత లేకపోవడమే దీనికి కారణం. బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతు న్నాయి. ఈ లెక్కలు స్పష్టంగా లేకపోవడం వల్లనే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయిం చడాన్ని కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ణయిం చాలనే అంశంపై బీసీ కమిషన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. ఇదిలా ఉంటే వెనుకబడిన తరగతులకు ప్రయోజనాలు కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందంటు న్నారు సామాజిక శాస్త్రవేత్తలు. రాబోయే జనాభా గణనలోనైనా కులాలవారీగా లెక్కలు తీయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. 1931 తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాలవారీగా జనగణన చేపట్టనే లేదు. ఏది ఏమైనా వెనుకబడిన తరగతుల జనాభాపై ఇప్పటివరకు అంచనాలే తప్ప ఒక స్పష్టత అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలోఓబీసీల శాతం ఎంత అనేది ఒక అంచనాగానే మిగిలి పోతోంది. ఈ పరిస్థితుల్లో ఓబీసీలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నది వెనుకబడిన తరగతుల నాయకుల డిమాండ్. మొత్తంమీద కులగణన జరిగితేనే వెనుక బడిన తరగతులకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


