ఒకప్పుడు రాజకీయాల్లో ఎంతోకొంత విలువలు ఉండేవని సీనియర్ నేతలు బాధపడుతూ కనిపిస్తారు. రాజకీయాల్లో రాన రానూ మరింతగా దిగజారుతున్న పరిస్థితే కనిపిస్తుంది. అధికారం కోసం ఏం చెయ్యా లనేది అప్పటి నేతలు ఆలోచిస్తే, ఏం చేసైనా అధికారం దక్కించుకోవాలనే ఆలోచనా విధానం ఇప్పటి నేతల విధానాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు…శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. తాజాగా ఇదే విషయం ఇదే నిజం కాబోతుందనే చెప్పాలి. పాత మిత్రులు టీడీపీ, బీజేపీలు మళ్లీ చేతులు కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే వారం ఎన్డీఏలో టీడీపీ చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న లేదా 20న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం . మరోవైపు ఈరోజు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగను న్నాయి. లోక్ సభ ఎన్నికలకు పార్టీని సమా యత్తం చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈ సమావేశాల అనంతరం పొత్తులపై పార్టీ హైకమాండ్ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ నెల 20న చంద్రబాబు, పవన్ లతో బీజేపీ అగ్ర నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని సమాచారం. సీట్ల పంపకాల విషయంలో కూడా ఒక అవగా హనకు వచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్డీఏలో చేరే ఇతర పార్టీల అధినేతలందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తోంది.


