అన్నదాతలు మరోసారి ఆగ్రహించారు. తమ చట్టబద్దమైన డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఢిల్లీ నగరంలో యుద్ద వాతావరణం నెలకొంది. 2020లో రైతులు దాదాపు ఏడాదిపాటు ఢిల్లీ శివార్లలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఎవరితో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోవాలన్నదే అప్పట్లో అన్నదాతల ప్రధాన డిమాండ్. రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. రైతు నాయకులను అరెస్టు చేసింది. అయితే అన్నదాతలు మడమతిప్పకుండా ఉద్యమించారు. దీంతో వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా రైతు సంఘాలతో కేంద్రం పలు ఒప్పందాలు చేసుకుంది. అయితే ఒప్పందాలు కుదుర్చుకుని రెండేళ్లు దాటినా, ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదు కేంద్రం. ఈ నేపథ్యంలో మరోసారి ఆందోళనలకు అన్నదాతలు సన్నద్ధమయ్యారు. ఛలో ఢిల్లీ అంటూ హస్తినకు వెళ్లారు.
పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది అన్నదాతలు చేస్తున్న ప్రధాన డిమాండ్. 2021లో అప్పటి కేంద్రప్రభుత్వం పాత ఎమ్మెస్పీ చట్టాన్ని రద్దు చేసింది. ఆ స్థానంలో కొత్త చట్టం చేసింది. అయితే కొత్త చట్టం అమలులో అనేక లోపాలున్నాయన్నది రైతుల ఆరోపణ. కనీస మద్దతు ధరలను నిర్ణ యించడంలో పారదర్శకత లోపించిందన్నది రైతుల మరో ఆరోపణ. దీంతో అనేక పంటలకు ఎమ్మెస్పీ ధరలు అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతు కూలీల పెన్షన్ మరో డిమాండ్. అరవై ఏళ్లు నిండిన రైతులకు అలాగే రైతు కూలీలకు నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు, కూలీల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు పెన్షన్ అవసరమని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. పంటలకు రాయితీలు పెంచాలనేది రైతు సంఘాలు చేస్తున్న మరో డిమాండ్. విద్యుత్, ఎరువులు, విత్తనాలు వంటి వాటిపై రాయితీలు పెంచా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలికాలంలో వ్యవసాయ ఖర్చులు ఎడాపెడా పెరిగాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పంటలకు రాయితీలు పెంచడం ద్వారా అన్నదాతలపై ఆర్థిక భారం తగ్గుతుందని రైతు సంఘాలు భావిస్తున్నాయి.
మనదేశంలో వ్యవసాయరంగ అభివృద్దికి స్వామినాథన్ నాయకత్వంలోని కమిషన్ గతంలో అనేక సిఫార్సులు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను బుట్టదాఖలు చేసింది. ఈ సిఫార్సులు చేయడం వల్ల దేశవ్యాప్తంగా రైతాంగానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్న డిమాండ్ కూడా ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. వీటన్నిటితో పాటు 2013నాటి భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూ సేకరణ చట్టం ఫలితంగా దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని సంఘాలు పేర్కొంటున్నాయి. భూసేకరణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకోసం సర్కార్ లాక్కుంటుందని రైతు సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు.