యూఏఈ లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల అగ్రనేతల మధ్య, ప్రతినిధుల బృందం స్థాయిలో విస్తృత చర్చలు జరిగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిన్టెక్ తదితర రంగాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడుకున్నారు. అగ్రనేతలిద్దరి సమక్షంలో మొత్తం 8 ఒప్పందాల మార్పిడి జరిగింది. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఇందులో కీలకమైంది.
ఈ సమావేశంలోనే యూఏఈలో యూపీఐ రుపే కార్డు సేవలను ప్రారంభించారు. అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన పేరుతో ఉన్న కార్డును స్వైప్ చేయడం ద్వారా ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు విమానాశ్రయంలో దేశాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అబుదాబీలో ప్రవాస భారతీయులతో మోదీ భేటీ అయ్యారు. యూఏఈలోని పలు ప్రాంతాల నుంచి ఇంత భారీసంఖ్యలో ఈ సమావేశానికి వచ్చి చరిత్ర సృష్టించారన్నారు మోదీ. భారతీయుల సామర్థ్యంపై తనకున్న భరోసాతో మూడోవిడత పాలనలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరిస్తుందని గ్యారంటీ ఇచ్చానని చెప్పారు. ఐఐటీ ఢిల్లీ – అబుదాబీ క్యాంపస్ ఏర్పాటు ఓ కొత్త అధ్యా యం సృష్టించడమే కాదు, ఇరు దేశాల యువతను చేరువ చేసిందని చెప్పారు. యూఏఈ తమకు మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి, ఏడో అతిపెద్ద పెట్టుబడిదారని వివరించారు. ఇరు దేశాలు ప్రపంచమనే పుస్తకంపై కాలమనే కలంతో మెరుగైన భవితను లిఖిస్తున్నాయని మోదీ అన్నారు.


