ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఐదేళ్లు కావస్తోంది. ఈ ఐదేళ్లకాలంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నమ్మకమైన మిత్రపక్షంగా కొనసాగింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఎన్డీయే కూటమిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీ కాదు. అయినప్పటికీ నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును బలపరచిన పార్టీల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ముందువరుసలో ఉంది.
విభజన సందర్భంగా అప్పటి మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు ఇచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా విభజన హామీలను బలపరచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరోజూ ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తేలేదని పార్లమెంటు వేదికగా అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం స్పందించలేదన్న విమర్శలున్నాయి. అయితే బీజేపీ పెద్దలతో పొత్తు విషయమై చర్చించడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లగానే జగన్మోహన్ రెడ్డి స్వరం మారింది. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు తగ్గాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరింతగా అభివృద్ది చెందేదన్నారు. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుయ్య బట్టారు. కథ అక్కడితో ఆగలేదు. ఫైనాన్స్ కమిషన్ సూచించినట్లు కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ కు వాటా పూర్తిస్థాయి లో అందడం లేదని జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆదాయం భారీగా తగ్గిపోయిందన్నారు. ఇదిలా ఉంటే ఐదేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్రం పట్ల మారిన జగన్మోహన్ రెడ్డి వ్యవహారతీరు చర్చనీ యాంశమైంది.
ఇప్పటివరకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకు న్నదన్న రీతిలోనే ప్రవర్తించిందన్న ఆరోపణలున్నాయి. ఇందుకు తగ్గట్టే పార్లమెంటులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీలు కూడా వ్యవహరించారు. కీలకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు, ఆర్‌టీఐ, పౌరసత్వ సవరణ బిల్లుతో పాటు మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు లేకపోతే పార్లమెంటులో ఆమోదం పొందేవి కావని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన కీలకమైన బిల్లులకు మద్దతు ఇవ్వా లంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో షరతు విధించి ఉండాల్సిందని పొలిటికల్ పండితులు అంటున్నారు. కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి అలా షరతు విధించినట్లయితే, అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నది రాజకీయ పరిశీలకుల వాదన. ఈ విషయ మైన గతంలో ప్రతిపక్షాలు అనేకసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అప్రమత్తం చేశాయి. అయిన ప్పటికీ ప్రతిపక్షాల సూచనలను జగన్మోహన్ రెడ్డి ఏరోజూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి నుంచి ఒత్తిడి లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని నరేంద్ర మోడీ సర్కార్ అటకెక్కించిందన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం అందిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి వస్తున్న నిధులు తగ్గిన విషయం గుర్తుకు వచ్చిందా అని ఆర్థిక నిపు ణులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద పొత్తులపై ఢిల్లీలో ఏం తేలుతుందో తెలియదు కానీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బాస్ స్వరమైతే మారింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో అలజడి నెలకొంది.