ఉమ్మడి పౌర స్మృతి దిశగా ఉత్తరాఖండ్ అడుగులు వేసింది. ఉత్తరాఖండ్‌కు 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగా యి. తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని ఎన్నికల ముందు ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని చేర్చింది బీజేపీ పెద్దలు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు 2024ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రవేశపెట్టారు.యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఓ చరిత్రాత్మక ఘట్టంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. బిల్లు విషయం లో ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌తో అన్నివర్గాలకు మేలు జరుగుతుందన్నారు పుష్కర్ సింగ్ ధామి. బిల్లుపై సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా అన్ని పార్గీల ఎమ్మెల్యేలను పుష్కర్ సింగ్ ధామి కోరారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా బీజేపీ సభ్యులు జై శ్రీరామ్, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.
2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. దీంతో ఉమ్మడి పౌర స్మృతి అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కమిటీ వేశారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై సుదీర్ఘ కసరత్తు చేసింది. ఒకటి కాదు…రెండు కాదు…70కిపైగా సమావేశాలు నిర్వహించింది. అంతేకాదు…ఉమ్మడి పౌర స్మృతి అంశం మంచిచెడుల గురించి 60 వేలమందితో సంప్రదింపులు జరిపింది. ఉమ్మడి పౌర స్మృతి అంశంపై ధామి ప్రభుత్వం పక్కాగా కసరత్తు చేసింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో కూడా సలహాలు, సూచనలు కోరింది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో వచ్చిన 2.33 లక్షల సలహాలు, సూచ నలను కమిటీ పరిశీలించింది. బిల్లుకు సంబంధించి అన్ని విషయాలు సమగ్రంగా పరిశీలించింది. ఆ తరువాత ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి ఒక ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాను ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి పుష్కర్ సింగ్ థామికి అందచేసింది కమిటీ.
కమిటీ అందచేసిన ముసాయిదాపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింపచేసుకుంది. ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే మతాలకతీతంగా ఉత్తరాఖండ్‌లోని పౌరులందరికీ వివాహ, విడాకుల,భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఉమ్మడి పౌరస్మృతి అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీ యాంశమైంది. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఈనెల నాల్గవ తేదీన ధామి క్యాబినెట్ తొలుత ఆమోదించింది. భారత దేశంలో మొదటి ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డులకు ఎక్కింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం కావడం మరో విశేషం.