ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు లిట్మస్ టెస్ట్‌గా మారాయి. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో సమాజంలోని అనేక వర్గాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి. వీరిలో యువత ఎక్కువగా ఉంది. విభజనకు ముందు హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో యువతీయువకులు హైదరాబాద్ వెళ్లేవారు. అక్కడి ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు చేసుకునేవారు. అలా చదువుకున్న యువతకు నిరుద్యోగం అనే సమస్యే ఉత్పన్నం అయ్యేది కాదు. అయితే విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ సామాజిక పరిస్థితులు మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వస్తే తమకు ఉద్యోగాలు దొరుకుతాయని ఆంధ్రప్రదేశ్ యువత భావించింది.దీంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి యువత జై కొట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్ యువత ఆనందం ఆవిరికావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఆంధ్రప్రదేశ్‌ను ఉద్యోగాలకు హబ్‌గా తయారు చేయాల్సిన బాధ్యతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరచిపోయింది. దీంతో ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ యువత రోడ్డున పడింది.
మరోవైపు సంక్షేమాన్నే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. జగన్ సర్కార్ రాకముందు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌కు అనేక కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి. అయితే ఈ కార్పొరేట్ కంపెనీలకు జగన్ సర్కార్ ఏమాత్రం సహకరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు చాలనుకుంటూ కార్పొరేట్ కంపెనీలు పెట్టే బేడా సర్దుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయాయి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యానికి పరాకాష్ట అంటున్నారు నిపుణులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పులకుప్పగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలంగా ఉండేది. చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బావుండేది. ఆదాయం, వ్యయాలను బ్యాలెన్స్ చేస్తూ పాలించారు చంద్రబాబు నాయుడు. అయితే 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయం, వ్యయాలను పట్టించుకోలేదు. అవసరం ఉన్నా, లేకపో యినా అందినకాడికి అప్పులు తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఈ అప్పులకు ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడలేదు. ఇప్పటికీ వీలున్న ప్రతి చోటు నుంచి అప్పులు తీసుకువస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.అప్పుల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ను రిజర్వ్ బ్యాంక్ అనేకసార్లు సుతిమెత్తంగా చురకలు వేసింది. కొన్నిసార్లు ఘాటుగా మందలిం చింది. ఇలా ఎడాపెడా అప్పులు చేయడం సరైన పద్ధతి కాదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. జగన్మోహన్ రెడ్డి సర్కార్‌కు అసలు ఆర్థిక క్రమశిక్షణ అనేదే లేకుండా పోయిందని మండిపడ్డారు.
ఇవన్నీ ఇలా ఉంటే, రాజకీయంగానూ జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. టికెట్లు రాని నాయకు లంతా పెట్టేబేడా సర్దుకుని ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. మరికొంతమంది ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో ఉంటూనే మరోవైపు తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలతో టచ్‌లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏమాత్రం అటూ ఇటూ అయినా, ప్రతిపక్ష పార్టీల తరఫున బరిలోకి దిగడానికి సన్నద్ధమవుతున్నారు. ఏమైనా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వైఎస్ జగన్మోహన రెడ్డికి ఏమాత్రం నల్లేరు మీద నడక కాదు. సమాజంలోని అన్ని వర్గాల వ్యతిరేకత ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి చెమటో డ్చక తప్పదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.


