వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆయన వ్యవహార శైలి అందరికంటే కాస్త భిన్నంగా ఉంటుంది. అంతేకాదు ఏదో ఒక వ్యాఖ్య లతో తరచూ వార్తల్లోకి ఎక్కుతారు. అన్ని విషయాల్లోనూ సూటిగా మాట్లాడే ఆయన ఒక్క విషయంలో మాత్రం ఎటూ తేల్చడం లేదు. తన పోటీ పై కాలమే చెబుతోందని మాట దాటేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక రాజకీయాల నుంచి వైదొదలగుతారా అనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ కార్యక్రమా లకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఆయన తీరు ఫై స్థానిక నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. తాను ఉంటున్న పార్టీపైన, ప్రభుత్వంపైన నెగిటివ్ కామెంట్స్ చేస్తూ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారారనే వాదన లు సైతం బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో సీఎం పాల్గొన్న సభకు దూరంగా ఉన్న ఆయన శనివారం జరిగే సిద్ధం సభలో పాల్గొంటారా లేదా అనే విషయం స్పష్టత లేదు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు?
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యవహారశైలి చూస్తే రాజకీయాల్లో ఉంటారా లేక సన్యాసం పుచ్చు కుంటారా..లేక ప్రతి పక్ష పార్టీలో చేరతారా అనే విషయం కొద్ది కాలంగా వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. నియోజక వర్గంలో పర్యటనలు చేస్తున్న ఆయన ప్రభుత్వంఫై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి చేయకపోవడం వల్ల ప్రజలు నిలదీస్తున్నారని, చేసిన పనులకు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకునే స్థితి ఉందని ఒక గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడటం మీడియాలో పెద్ద దుమారమే రేపింది. బాహాటంగానే వైసీపీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. దీంతో సీఎం జగన్ ఆయనను పక్కన పెట్టారనే వాదనలు వినినిస్తున్నాయి.
గతంలో గుంటూరులో ఒక ఎన్అర్ఐ నిర్వహించిన సభలో ప్రతిపక్ష నాయకుడు పాల్గొన్న సమయంలో జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందటంతో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎన్ అర్ ఐ వసంత మిత్రుడు కావడంతో ఆయనపై తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై విమర్శలకు తెగబడ్డారు. సంధు దొరికితే పార్టీ అధిష్టానాన్ని, ప్రభుత్వ చర్యలపై అప్పటి నుంచి ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. సొంత పార్టీలోనే రెబల్ గా మారారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో మాత్రం తప్పని సరిగా పాల్గొంటున్నారు. పోనీ అక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాల పట్ల సానుకూల ప్రసంగం చేస్తున్నారా అంటే అదీ లేదు. అక్కడ కూడా ప్రభుత్వంఫై పరోక్షంగా విమర్శలు చేస్తూ… నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల విజయవాడ నడి బొడ్డున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నప్పటికీ ఎడమొఖం పెడమొఖంలా వసంత దూరంగానే ఉన్నారు.
ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిస్థాత్మకంగా తీసుకున్న సభలో… వసంత విజయవాడలో ఉండి కూడా పాల్గొనక పోవడం వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించింది.అంతేకాదు ఇటు స్థానిక నాయకులు అటు కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. వైసీపీ అధిష్టానానికి, ఎమ్మెల్యేకి మధ్య నియోజకర్గంలోని క్యాడర్ మొత్తం దెబ్బతింటుందని ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కొద్ది కాలంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకుకూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. ఫోన్లు చేసిన కూడా స్పందన ఉండటం లేదని స్థానికి నాయకులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్అర్ ఆసరా కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉండటంతో జిల్లా నాయకత్వం పిలుపు మేరకు పార్టీ నాయకులే నిర్వహిస్తున్నారు.
వసంత వ్యవహారశైలినీ క్షుణంగా పరిశీలన చేస్తున్న పార్టీ అధినాయకత్వం జిల్లా నాయకత్వానికి స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు ‘సిద్ధం’ పేరుతో 3వ తేదీన దెందులూరు కేంద్రంగా బహిరంగ సభను ఏర్పాటు చేసింది. నాయకులను, కార్యకర్తలను తరలించే బాధ్యతను జిల్లా నాయకత్వానికి అప్పగించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న పడమట సురేష్ బాబుకు ఆ బాధ్యతను అధిష్టానం అప్పగించింది. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ జన సమీకరణపై దృష్టి కూడా పెట్టి అందరితో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గానీ ఆయన కార్యాలయం నుంచిగానీ ఇప్పటి వరకు తమకు ఎటువంటి సమాచారం రాలేదని నాయకులు చెప్పడం మరింత చర్చకు దారితీసింది. ఏది ఏమైనా తమ అధినాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే సభను జయప్రదం చేసేందుకు నాయకులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోని పని చేస్తున్నారు. తన వ్యాఖలతో వైసీపీ అధిష్టానానికి, ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినప్పటికీ అంగ, అర్ధ బలం ఉన్న తన వైపే వైసీపీ అధిష్టానం చూస్తోందని ధీమాతో ఉన్నారు వసంత. అయితే వసంతకు త్వరలోనే సీఎం జగన్ షాక్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని, వైసీపీ వర్గాల్లో గుసగుసలు వనిపిస్తున్నాయి. గతంలో వసంత చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ చూసీ చూడనట్లు వదిలేసినప్పటికీ , ఎన్నికల సమయంలోనైనా ఆయన వ్యవహారశైలి మార్చుకుంటారని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది.అయినా ఆయన తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతేకాకుండా వసంత మాటలు.. పార్టీకీ నష్టం చేసే విధంగా ఉండటంతో ఆయనను సీఎం జగన్ దూరం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే పార్టీ ఆయనకు సీటు ఇచ్చేది లేదని వైసీపీ బాహాటంగా మాట్లాడుతున్నాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీకి నష్టం జరగకుండా చేసేందుకు వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోం ది. ఇటీవల నియోజకవర్గాల మార్పులో భాగంగా జిల్లా మంత్రిగా, పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ పెనమలూరుకు మార్చారు. ఆ నేపథ్యంలోనే అవసరమైతే మైలవరంలో పోటీ చేయాల్సి ఉంటుందని ముందుగానే జోగి రమేష్ కు చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా వైసీపీ అధిష్టానం తాడేపల్లి కేంద్రంగా మైలవరం పోటీపై చర్చలు చేసినట్లు సమాచారం. మంత్రి జోగి రమేష్ తో సీఎం జగన్ పలు సార్లు చర్చలు నెరపిన అనంతరం సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేయాలనీ ఆదేశాలు రావడంతో పెనమలూరులో కూడా కార్యక్రమాలు తగ్గించినట్లు జోగి రమేష్ ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో అధిష్టానం కూడా ప్రకటన చేస్తుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ చేసే ప్రకటనతో వసంత పార్టీలో ఉంటారా? ఆయనకు టిక్కెట్ వస్తుందా? రాదా? అన్నది కూడా ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇదిలాఉంటే వచ్చే నెల 4,5 తేదీల్లో తాను మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానని, తన మనోభావాలు వెల్లడిస్తా నని చెప్పడం చూస్తే వైసీపీ నుండి వసంత త్వరలోనే వైదొలగుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద ఒక చిన్న వివాదం వసంతను పార్టీకి దూరమయ్యేలా చేసింది. ఇదిలా ఉంటే వసంత క్యాడర్ ఎటు వైపు మొగ్గు చూపుతారనే అంశం కూడా తెరపైకి వచ్చింది. వసంత పూర్తిగా రాజకీయాల నుండి వైదొలగుతారా? లేదా వేరే పార్టీలో చేరతారా అనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. వసంత రాజకీయ భవిష్యత్తు ఏంటనేది రాజకీయ తెరపై వేచి చూడాల్సిందే.