శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఫైట్ కు రంగం కాబోతోంది. మంత్రి ఉషశ్రీ, టీడీపీకి చెందిన సవితమ్మ ప్రధాన అభ్యర్థులు కాగా. .. బీజే పార్థసారథి చక్రం తిప్పేందుకు సిద్ధమ య్యారు. ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు చకచకా మారుతున్న వేళ.. రసవత్తరమైన పోరులో పెనుగొండ ఖిల్లా ను దక్కించుకునేది ఎవరు..? పెనుకొండ ప్రజలు ఆదరించేది ఎవరిని…??
అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీ ల్లో సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రత్యర్థి, అక్కడున్న సామాజిక సమీకరణాలు బట్టి అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నాయి రాజకీయ పక్షాలు. పెనుగొండ లో తెలుగుదేశం పార్టీ టికెట్ ను సీనియర్ నాయకులు బికే .పార్థ సారధితోపాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆశించారు. సీనియర్ లీడర్ కావడంతో దాదాపు ఎమ్మె ల్యే అభ్యర్థి గా పార్థసారధికే టికెట్ దక్కుతుందని అనుకున్నారంతా. బీకే పార్థసారథి, సవితమ్మలో ఎవరికి టికెట్ ఇవ్వాలా అని టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నవేళ.. అనూహ్యంగా మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుగొండ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఉష శ్రీ ని కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెనుగొండకు మార్పుస్తూ, అక్కడి నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో సమీకరణలు మారిపోయాయి. పెనుగొండలో కురుబ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం తో జగన్ ఉషశ్రీ పెనుకొండ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన సవితమ్మ ను బరిలోకి దింపేందకు టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఉష శ్రీ కురుబ సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆమె భర్త ది రెడ్డి సామాజిక వర్గం. సవితమ్మ కూడా కురుబ సామాజికవర్గమే అయినా, ఆమె భర్త కమ్మ సామాజిక వర్గం. దీంతో వీరి మధ్య పోటీ మరింత ఆసక్తి రేపుతోంది. సవిత మ్మకు పెనుకొండ నియోజకవర్గం లో కలిసివచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఆమె స్థానికురాలు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై డైనమిక్ గా దూసుకు వెళ్లడం, సమస్యలపై పోరాటాలు చేయడంతో ప్రజలతో మమేకం అయ్యారు.ఉషశ్రీ చరణ్ కి పెనుగొండలో నాన్ లోకల్. ఇక్కడ స్థానికత ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది. పెనుగొండ నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకరనారాయణ వర్గీయులు ఉషశ్రీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజీనామాలకు కూడా సిద్ధమ య్యారు. అవినీతి అనకొండ పెనుగొండకు వద్దు అని సొంత పార్టీ నేతలే రోడ్డెక్కడంతో దిక్కుతోచని స్థితిలో ఉషశ్రీ శిబిరం ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం లో పార్టీ కోసం, ఆమె గెలుపు కోసం కృషి చేసిన ఎంతో మంది పార్టీ కార్యకర్తలు , నాయకులపై అక్రమ కేసులతో ఇబ్బందులు కు గురిచేశారనే అపనింద ఉషశ్రీ మూట కట్టుకున్నారు. ఇన్ని మైనస్ పాయింట్లు ఉషశ్రీ వైపు ఉండడంతో సవితమ్మకు గెలిచే ఛాన్స్ లు మెరుగయ్యాయి.
టికెట్ రాని బి.కె పార్థసారధికి బుజ్జగించి అనంతపురం ఎంపీగా బరిలోకి దించేందుకు టీడీపీ యోచిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ముఖ్యులకు సముచిత స్థానం కల్పించడం వల్ల పార్టీలో గ్రూపులను సంతృప్తి పరచినట్ల యింది. ఇవన్నీ పరిశీలిస్తే సవితమ్మ గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సవితమ్మకు ఉషశ్రీ గట్టి పోటీ ఇస్తుందా. ఆమె విజయం కోసం వైసీపీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో చూడాలి.