తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు భాగ్యనగరం దాదఖాళీ అవుతుంది. పండుగను మరింత సంతోషంగా జరుపుకునేందుకు స్వగ్రామాల బాట పడుతుంటారు నగరవాసులు. అయితే ఇదే అదునుగా చేసుకుని తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసుకుంటారు దొంగలు. ఈ సమయంలో దొంగలు తమ తెలివిని పని చెప్తుంటారు. ఇళ్లు తాళాలు వేసి ఉంటే చాలు.. తమకు అందిన కాడిని దోచుకోవడానికి రెడీ అవుతుంటారు.య అయితే వీరి భరతం పట్టడానికి ట్రై కమీషనరేట్లలో పెట్రోలింగ్ గస్తీకి పోలీసులు సిద్ధం అవుతున్నారు.
దక్షిణాదిన తెలుగు వారి పండుగలలో సంక్రాంతి పండుగకు విశేషాలు ఎన్నో ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలోని జనవరి మాసంలో జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి. పండుగ వస్తోందంటే చాలు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు ప్రజలు రెడీ అవుతుంటారు. ఈ ఏడాది కూడా ఉపాధి కోసం పల్లెలు నుంచి పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలు సంక్రాంతి కోసం స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. పండగ నాటికి నగరం దాదాపు ఖాళీ అవుతుంది. అయితే ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు హైదరా బాద్ పోలీసులు. దీనికి సంబంధించి అవగాహన పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇళ్లకు తాళం వేసి గ్రామాలకు వెళ్లేవారు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను సేఫ్గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
నగరంలో దొంగల బెడద ఎక్కువైంది. దీంతో ఊళ్లకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వీలైతే తమ వెంట తీసుకెళ్లడం గానీ.. లేదంటే బ్యాంక్ లాకర్లో పెట్టడం గానీ చేయాలన్నారు. ఊళ్లకు వెళ్లే వారు నమ్మకంగా ఉన్న పొరుగువారికి చెప్పాలన్నారు. వీలైతే.. స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే.. అక్కడ నిఘా పెంచుతారని పోలీసులు తెలిపారు. అదే విధంగా కాలనీల్లో ఎవరైనా అపరిత వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే.. తమకు వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు.
బయట గేటుకు లోపలి నుంచి తాళం వేయాలని, ఊరికి వెళ్లేటప్పుడు నమ్మకమైన వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ప్రయాణం గురించి సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. కాలనీలో, ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మేలని సలహా ఇస్తున్నారు. ఇంటి తాళం కనిపించకుండా అడ్డుగా పరదా వేయాలని, అనుమానం వస్తే వెంటనే 100 నంబరుకు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.