సింహపురి రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్‌హాట్‌గా.. నెల్లూరు చేపల పులుసులా.. స్పైసీగా నడుస్తాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతుంటాయి. ప్రధానంగా నెల్లూరు సిటీలో జరుగుతున్న రాజకీయ సన్నివేశాల గురించి జిల్లాలో ఏ కాఫీ కేఫ్‌లో చూసిన ప్రజలు కథలుకథలుగా చెప్పుకుం టున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో సింహపురి రాజకీయాలు ఎలా మారనున్నాయి. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఏంటి..? నెల్లూరు సిటీలో గెలుపు ఎవరిది?
నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తమ హవా కొనసాగించింది. జిల్లాలో టీడీపీ పట్టు కోసం ప్రయత్నాలు అనేకం చేసినా.. కాంగ్రెస్‌కే అప్పట్లో ప్రజలు పట్టం కట్టారు. దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైసీపీ ఏర్పడటం, వైసీపీ అధినేత జగన్ వెంట నడిచిన నేతల్లో ఈ జిల్లా నుంచే పలువురు నేతలు తొలి అడుగులు వేయడంతో నెల్లూరు జిల్లా ప్రాధాన్యత మరింత పెరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పది నియోజకవర్గాలకు గాను వైసీపీ 7, టీడీపీ 3 గెలుచుకున్నాయి. నెల్లూరు, తిరుపతి ఎంపీలతో పాటు కార్పొరేషన్ మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా వైసీసీ సొంతం చేసుకుంది.
అటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎవరూ ఊహించని విధంగా నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకి మంత్రి పదవి దక్కింది. రాష్ట్రం మొత్తం టీడీపీ హవా కొనసాగినా… నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీ టీడీపీని ధీటుగా ఎదుర్కొంది. ఇక 2019 ఎన్నికల్లో పదికి పది స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు చతికిల పడిపోయాయి. దాదాపు మూడేళ్ల కాలం ఎవరూ నోరు మెదపని పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా పరిస్థితులు మారాయి. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరిపోయారు. దీంతో వచ్చే ఎన్నికలను అధికార, విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి… రాబోయే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైపోయాయి. ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం ఉండడంతో ఎన్నికల వేడి నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది.
నెల్లూరు జిల్లాలో ప్రధానమైంది సిటీ నియోజకవర్గం. 2009లో నెల్లూరు నియోజకవర్గంని సిటీ, రూరల్ గా విభజించారు. 2009లో కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీచేయగా… ప్రజారాజ్యం పార్టీ నుంచి ముంగమూరు శ్రీధర్ క్రిష్ణారెడ్డి పోటీచేసి గెలుపొందారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో జగన్ వెంట అనిల్ అడుగులు వేశారు. 2014లో టీడీపీ అభ్యర్థి శ్రీధర్ క్రిష్ణారెడ్డిపై, 2019లో నారాయణపై రెండుసార్లు సిటీ నుంచి అనిల్ గెలుపొందారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రావడం, నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంతో సిటీ నారాయణ కంట్రోల్‌లోకి వెళ్లింది. అనిల్ పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడం, ప్రజల్లో తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలుపొందాక అనిల్‌కు మంత్రి పదవి ఇచ్చారు జగన్. దీంతో కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమైన నారాయణ,
సిటీలో ఎక్కడా కనిపించలేదు.
నెల్లూరు సిటీలో వైసిపి టిడిపితోపాటు, సిటీ నియోజకవర్గంలో జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. 2019 ఎన్నికల్లో సిటీ నుంచి కేతంరెడ్డి, వినోద్ రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీచేశారు. దీంతో భారీగా ఓట్లు చీలాయి. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జనసేన ప్రభావం భారీగా పెరిగింది. గ్రౌండ్ లెవల్లో యువత, మహిళలు జనసేన వైపు మొగ్గుచూపుతున్నారని టాక్. రానున్న ఎన్నికల్లో అనిల్, నారాయణ, జనసేనల మధ్య పోటాపోటీగా ఉండబోతోంది. పొత్తులు ఖరారైతే ఇక్కడ నుంచి ఎవరు పోటీచేస్తారనేది కూడా చర్చగానే మారింది.