ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. వైఎస్ హయాంలో ఒకే మాట, ఒకే బాటగా ఉండే కుటుంబం.. తమరి నిర్వాకంతోనే రెండుగా చీలిపోయిందన్న లోగుట్టు ప్రపంచానికంతా తెలుసు జగనన్నా అని ఎద్దేవా చేశారు. తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ఈరోజు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.
జగన్ జైల్లో ఉన్న సమయంలో వైసీపీ విజయానికి అహర్నిశలు శ్రమించిన తల్లి, చెల్లి కష్టాన్ని వాడుకుని సీఎం అయ్యాక వారిని బయటకి తరిమేసిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణాన్ని అని మీ కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లికి అన్యాయం చెయ్యమని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని ప్రశ్నిం చారు. చెల్లికి ఆస్తిపంపకాల్లో అన్యాయం చెయ్యమని, ఎంపీ టికెట్ ఇవ్వొద్దని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పా డు? అని అడిగారు.
ఢిల్లీలో తన తండ్రి హత్య కేసు నిందితుల్ని శిక్షించాలని కాళ్ళు అరిగేలా తిరుగుతున్న మరొక చెల్లికి న్యాయం చెయ్యొ డ్డని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని ప్రశ్నించారు. తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని గౌరవించలేనివాడు.. సమాజాన్ని కూడా గౌరవించలేడనే విషయం మరోసారి మీ ద్వారా నిరూపితమయిందని అన్నారు. మీరు పెట్టిన చిచ్చే రాబోయే ఎన్నికల్లో మిమ్మల్నే చుట్టుముట్టబోతోందనే విషయాన్ని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారూ అని గంటా ట్వీట్ చేశారు.