తెలంగాణ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. డిసెంబర్ 3న వెలువడనున్న ఫలితాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? ఓటర్లు ఎవరికి షాక్ ఇస్తారు అన్న దానిపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అదే సమయంలో ఈసారి మహా మహుల్లాంటి నేతల మధ్య ఎన్నికల పోరులో దిగారు కొందరు యువతీ యువకులు. పైగా వీళ్ల వయసు ముప్పై ఏళ్ల లోపు కావడం ఆసక్తి రేపుతోంది.
అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీపడుతున్న అతి తక్కువ వయసున్న అభ్యర్థుల్లో కొందర్ని పరిశీలిస్తే.. పాలకుర్తి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినీ రెడ్డి కన్పిస్తారు. బీటెక్ పూర్తి చేసిన ఈమె.. వివాహం తరువాత అమెరికా వెళ్లిపోయారు. అయితే..ఎర్రబెల్లిని ఢీకొట్టే అభ్యర్థి వేటలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీరెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే.. ఆమె పౌరసత్వం విషయంలో సమస్య రావడంతో.. ఆమె కోడలు 26 ఏళ్ల వయసున్న యశస్వినీరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. టికెట్ దక్కడంతో..నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు దీటుగా ప్రచారం నిర్వహిస్తూ హస్తం తరఫున ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు యశస్వినీ రెడ్డి.
ఈ ఎన్నికల బరిలో ఉన్న మరో అభ్యర్థి దాసరి ఉష. పెద్దపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న ఈమె వయసు 27 ఏళ్లు. నియోజకవర్గంలోని కనగర్తి గ్రామానికి చెందిన ఈమె.. ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్ పూర్తిచేశారు. లక్షల రూపాయల ఉద్యోగం వదలుకొని సామాజిక సేవ చేయడం ప్రారంభించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. పెద్దపల్లిలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు సవాలు విసురుతున్నారు.
ఈ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది మల్కాజ్‌గిరి. ఇక్కడ్నుంచి అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడికి సైతం టికెట్ ఆశించారు. కానీ, అది కుదరకపోవడంతో రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. అనుకున్నది సాధించారు. మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రోహిత్ రావు ప్రస్తుత వయసు 26 ఏళ్లు. బీఆర్‌ఎస్‌లో దక్కనిది కాంగ్రెస్‌లో లభించడంతో సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రోహిత్.
ఇక, కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న మరో అభ్యర్థి చిట్టెం పర్ణికా రెడ్డి. నారాయణపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈమె..విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చారు. 30 ఏళ్ల వయసున్న పర్ణికాది రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఫ్యామిలీనే.
వీరందరి కంటే భిన్నమైన నేపథ్యం నుంచి వచ్చారు బర్రెలక్కగా సోషల్ మీడియాలో ఫేమసైన కర్నే శిరీష. తన నిరుద్యోగానికి బాధపడకుండా తల్లి సాయంతో నాలుగు బర్రెలు కొనుక్కున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెగ వైరలైంది శిరీష. అయితే.. తనలాగా ఉన్న ఎందరో నిరుద్యోగుల వ్యధను ప్రపంచానికి చెప్పడమే లక్ష్యంగా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారీమె. 24 ఏళ్లు మాత్రమే ఉన్న శిరీష.. ప్రస్తుతం గట్టి ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. వయసులో తక్కువైనా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మేము సైతం అంటూ ఎన్నికల బరిలో ఉన్న వీరిని ఓటర్లు ఏమేరకు ఆదరిస్తారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.


