స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు శనివారం నాడు ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది. గణనీయ స్థాయిలో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల నివేదిక వెల్లడించినట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధినేతకు చేతులు, ముఖం సహా ఇతర చోట్ల దద్దుర్లు, అలర్జీ ఉన్నట్లుగా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. తీవ్రమైన ఎండల కారణంగా డీహైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెప్పారని తెలుస్తోంది. కాగా, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని నిన్న జైలు అధికారులు మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే.