హైదరాబాద్, 12 అక్టోబర్ 2023: శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రిత్విక్ జంపన, సిదీష్ రెడ్డి స్థాపించిన సివిటాస్ ఎన్జీఓ సంస్థ హైదరాబాద్‌లో మొట్ట మొదటి పబ్లిక్ ఈ-వేస్ట్ కలెక్షన్ బిన్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను మార్చడానికి, వెనుకబడిన వర్గాలకు తమ మద్దతు విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా సివిటాస్ ఈ-వేస్ట్ కలెక్షన్ బిన్‌ను ప్రారంభించింది.
పర్యావరణ సుస్థిరత, సామాజిక బాధ్యతపై నిబద్ధతతో సివిటాస్ ఇప్పటికే హైదరాబాద్‌లోని వ్యర్థ పదార్థాల నిర్వహణ విభాగంలో ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది. ఈ సంస్థ 20కి పైగా నివాస సముదాయాల్లో ఈ-వేస్ట్, ఫాబ్రిక్ వ్యర్థాల సేకరణ డబ్బాలను ఏర్పాటు చేసింది. యెంకపల్లి, జీవన్‌గూడ గ్రామాల్లో వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నెలకొల్పింది. ఇది రోజుకు 1000 కిలోల తడి, పొడి చెత్తను రీసైకిల్ చేస్తుంది. హైదరాబాద్‌లోని రాగ్‌పిక్కర్లకు 500 అవసరమైన ఆరోగ్య కిట్‌లు పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమాలు పరిశుభ్రమైన కమ్యూనిటీలకు మాత్రమే కాకుండా అట్టడుగు వ్యక్తుల జీవనోపాధిని మెరుగుపరిచాయి.
సివిటాస్ ఇప్పుడు తమ ఈ-వేస్ట్ కలెక్షన్ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ అంతటా విస్తరించడం ద్వారా తమ తదుపరి దశ ప్రయాణాన్ని ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సహకారంతో సెప్టెంబర్ 1న మాదాపూర్‌లో తమ తొలి ఈ-వేస్ట్ బిన్‌ను విజయవంతంగా ఆవిష్కరించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బాధ్యతాయుతంగా సేకరించి పారవేసేందుకు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో కనిపించే ప్రమాదకర పదార్థాలు, టాక్సిన్స్ నుండి పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది నగరవ్యాప్త కార్యక్రమానికి నాంది పలికింది. అంతే కాకుండా స్థానిక నీటికుంటలను శుభ్రపరచటం నుంచి.. US, UAEతో సహా మూడు దేశాలలో కార్యకలాపాలను నిర్వహించడం వరకు వారి ఇతర కార్యక్రమాలలో సహాయం చేయడానికి యువజన గ్రూప్లను తయారు చేయడం ద్వారా 200+ యువతను మిషన్‌లో నిమగ్నం చేశారు. సమిష్టి కార్యకలాపాల శక్తిని ఉపయోగించడం ద్వారా, అందరికీ స్థిరమైన, సమగ్రమైన భవిష్యత్తును సృష్టించగలమని వారు విశ్వసిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్షన్ డబ్బాల్లో తమ ఈ-వ్యర్థాలను బాధ్యతాయుతంగా పారవేయడం ద్వారా ఈ కీలకమైన ప్రయత్నంలో తమతో కలిసి రావాలని సివిటాస్ హైదరాబాద్ వాసులందరినీ అభ్యర్ధించింది. సమీప భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేయాలని వారు ఎదురుచూస్తున్నారు. మరో 5 పబ్లిక్ ఈ-వేస్ట్ బిన్‌లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు అమలులో ఉన్నాయి. సివిటాస్ సంస్థను +91 9154185335 లేదా civitasorganisation@gmail.comలో మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. civitasindia.org లో కూడా చూడవచ్చు.


