స్వతంత్ర వెబ్ డెస్క్: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు ఇవ్వనున్న 33% రిజర్వేషన్లలో ఓబీసీ కోటానూ అమలు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తాం. అప్పుడు దేశంలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు.. కానీ మేం చేస్తం” అని ఆయన చెప్పారు. 2010లో యూపీఏ హయాంలో రాజ్యసభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ కోటాను చేర్చనందుకు ఫీల్ అవుతున్నారా? అని ప్రశ్నించగా.. ‘‘అవును.. 100% పశ్చాత్తాప పడుతున్నాం. మేం అప్పుడే చేసి ఉండాల్సింది” అని తెలిపారు. ‘‘దేశంలో అందరికీ అధికారం దక్కాలంటే.. ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలియాలి. వెంటనే కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలి. యూపీఏ హయాంలో కులాల వారీగా చేసిన జనాభా లెక్కలను బయటపెట్టాలి” అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
అయితే, 2010లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌లు ఓబీసీ మహిళల కోటాలో కోటా ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే, కాంగ్రెస్ ఈ డిమాండ్‌ను తిరస్కరించడంతో ఎస్పీ మరియు ఆర్జేడీ మద్దతు ఉపసంహరించుకుంది. ఫలితంగా బిల్లు లోక్‌సభకు రాలేదు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, జనగణన, డీలిమిటేషన్ తర్వాతే దీనిని అమల్లోకి తెస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మంచిదే.. కానీ, జనగణన, డీలిమిటేషన్‌కు ఏళ్ల సమయం పడుతుందన్నారు. ఈ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
‘మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయొచ్చు. ఇది సంక్లిష్టమైన విషయం కాదు. కానీ, కేంద్ర ప్రభుత్వం అలా చేయదలుచుకోలేదు. దీని అమలును జనగణన, డీలిమిటేషన్‌తో ముడిపెట్టింది. ఈ బిల్లు పదేళ్ల తర్వాత అమలవుతుందని కేంద్రం చెప్పింది. ఇది అమలవుతుందో లేదో ఎవరికీ తెలియదు. కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మహిళా బిల్లును తెచ్చింది” అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ‘
‘కేంద్రంలో ముఖ్యమైన శాఖల సెక్రటరీలు 90 మందిలో కేవలం ముగ్గురే ఓబీసీలు ఉన్నారు. బడ్జెట్ లో ఓబీసీలకు కేటాయిస్తున్న నిధులు 5% మాత్రమే” అని చెప్పారు. మహిళా కోటాను వాయిదా వేసేందుకే డీలిమిటేషన్, జనాభా లెక్కల వంటి కుంటిసాకులు చెబుతోందని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ ఇప్పటికే విమర్శలు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్నికల గిమ్మిక్కుగా అభివర్ణించింది.
ఇదిలా ఉండగా.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల పేరుతో కేంద్రం నిర్వహించిన నాలుగు రోజుల భేటీలో దశాబ్దాలుగా పెండిగ్ లో ఉన్న చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అంతకుముందు రోజు లోక్‌సభలోనూ బిల్లుకు ఆమోదం లభించింది. 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. దాదాపు ఏకాభిప్రాయంతో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడం పార్లమెంటరీ చరిత్రలో సువర్ణాధ్యాయమని ప్రధాని మోదీ అభివర్ణించారు. అన్ని పార్టీల నేతలు, సభ్యులు మద్దతుగా నిలిచి చరిత్ర సృష్టించారని హర్షం వ్యక్తం చేశారు.