స్వతంత్ర వెబ్ డెస్క్: దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూసిన చంద్రయాన్ – 3 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇస్రో ల్యాండర్ నుంచి రోవర్ ఎలా దిగిందో అధికారిక ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేసింది. దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాటి నుంచి చంద్రయాన్ – 3 గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ రోజు ల్యాండర్ విక్రమ్ నుంచి ప్రజ్ఞాన్ వడివడిగా చంద్రుడి ఉపరితలం మీద అడుగుపెడుతున్న దృశ్యాలను పంచుకుంది. ‘చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ -3 ల్యాండర్ నుంచి రోవర్ ఇలా దిగింది’ అంటూ రాసుకొచ్చింది.
ఇదిలా ఉండగా, చంద్రుడి లెక్క ప్రకారం మన చంద్రయాన్ ల్యాండర్, రోవర్ అక్కడ ఒక్క రోజు మాత్రమే ఉంటాయి. అంటే 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యుడు అస్తమిస్తాడు. ఆ తర్వాత చంద్రుడి ఉపరితలం అంతా చీకటిగా మారిపోతుంది. దీంతో అక్కడ చిమ్మ చీకటి అయిపోతుంది. దీంతో పాటు ఉష్ణోగ్రత కూడా ఏకంగా మైనస్ 180 డిగ్రీలకు చేరుకుంటుంది. రోవర్, ల్యాండర్, పేలోడ్‌లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ల్యాండర్, రోవర్ పూర్తి మంచుతో కప్పబడుతాయి. అంతటి కఠిన వాతావరణంలో ఉండే రోవర్లలోని బ్యాటరీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి. ల్యాండర్‌లోని సోలార్ ప్యానల్ కూడా దాదాపు చెడిపోతాయి. ఒకవేళ 14 రోజుల తర్వాత .. రోవర్‌పై సూర్య రశ్మి పడి తిరిగి పని చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఒకవేళ రోవర్ తిరిగి పునరుజ్జీవం పొంది.. ల్యాండర్ పనిచేయక పోతే ఫలితం ఉండదన్నారు. రోవర్ స్వీకరించిన సమాచారం ల్యాండర్‌కు చేరవేస్తుందని.. ఆ ల్యాండర్ భూమిపై ఉన్న రీసెర్చ్ సెంటర్‌కు పంపిస్తుందని చెప్పుకొచ్చారు. ఒకవేళ 14 రోజుల తర్వాత తిరిగి ల్యాండర్ పనిచేస్తే.. అది స్వీకరించిన సమాచారాన్ని భూమికి పంపించగలదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవి 14 రోజులలోనే.. అవి చేయగలరని పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.