స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) మెదక్(Medak), సూర్యాపేట(Suryapet) జిల్లాల పర్యటన ఖరారు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు చివరి వారం నుంచి రెండు జిల్లాల్లో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశాల ద్వారా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించాలన్నది గులాబీ బాస్ ప్లాన్ గా తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు నెలాఖరులోగా మెదక్ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పలు బహిరంగ సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా.. తన బహిరంగ సభల ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎండగట్టాలన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది.
ఈ నెల 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ నెల 23కు వాయిదా పడిందని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు. కాగా.. సూర్యాపేట పర్యటన మాత్రం యదావిధిగా కొనసాగుతుందని తెలిపారు. సూర్యపేటలో 20న, మెదక్ లో 23న పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు క్లారిటీ ఇచ్చారు.