స్వతంత్ర వెబ్ డెస్క్: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై వస్తున్నవన్నీ అపొహలేనని టీఎస్‌పీఎస్సీ స్పష్టంచేసింది. పరీక్ష నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరుగలేదని హైకోర్టుకు వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషర్ల తరపు న్యాయవాది ప్రస్తావించిన ప్రధాన మూడు (నందిని వ్యవహారం, గ్రూప్-1కు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో తేడా, బయోమెట్రిక్ హాజరు) అంశాలపై టీఎస్‌పీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ వివరణాత్మక సమాధానం ఇచ్చారు.
పరీక్ష రాసిన ఓ అభ్యర్థి పేరు ఎర్రబోజు నందిని. ఆమెకు వివాహం కావడంతో ఇంటిపేరు కొత్వాల్‌గా మారింది. వివాహ ధ్రువీకణ పత్రం కొత్వాల్ పేరుతోనే ఉన్నది. వివాహానికి ముందే చదువు పూర్తవడంతో ఎర్రబోజు ఇంటి పేరు మీదే సర్టిఫికెట్లున్నాయి. గ్రూప్-1కు దరఖాస్తు చేస్తూ.. సంతకం అప్‌లోడ్ సమయంలో కే నందిని పేరుతో సంతకం చేసింది. కానీ, దరఖాస్తులో మాత్రం ఎర్రబోజు నందినిగానే ఉన్నది. దీనిని ఆసరాగా చేసుకున్న ముగ్గురు అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఒకరికి బదులుగా మరొకరి చేత గ్రూప్-1 పరీక్షను రాయించినట్టుగా అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
నందిని మ్యారేజ్ సర్టిఫికెట్, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను గురువారం హైకోర్టుకు ఏజీ సమర్పించారు. అభ్యర్థుల వాదనలో అర్థంలేదని పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష జరిగిన రోజు పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యపైనా అభ్యంతరాలు తెలిపారు. పరీక్షరోజు ఇచ్చిన పత్రిక ప్రకటనలో 2,33,248 మందిగా, ఆ తర్వాత ఓఎమ్మార్ షీట్లను స్కాన్‌చేయగా 2,33,506 ఉన్నట్టుగా తేలాయని, అంటే… మరో 258 మంది ఎలా అదనంగా రాశారని కోర్టులో ప్రస్తావించారు. మొదట ఫోన్లో తీసుకున్న సమాచారం ప్రకారం 2,33,248 మంది రాసినట్టుగా తేలిందని, ఇది తాత్కాలిక సంఖ్యయేనని, దీనిని ప్రామాణికంగా తీసుకోరాదని, ఓఎమ్మార్ షీట్లే ప్రామాణికమని అడ్వకేట్ జనరల్ వాదించారు. ఎన్నికల సమయంలోను మొదట ఒక పోలింగ్ శాతానికి ప్రకటించి, తర్వాత రోజు పూర్తిగా లెక్కించి, పూర్తి పోలింగ్‌శాతాన్ని ప్రకటించినట్టుగా తాము చేశామని ఏజీ వివరించారు.