స్వతంత్ర వెబ్ డెస్క్: జోరున కురుస్తున్న వర్షాలు, ఏకధాటిగా ప్రవహిస్తున్న వరదలతో ములుగు జిల్లాలో పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. రెండ్రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి జాతీయ రహదారి 163 పై తెగిన వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో వరంగల్, హైదరాబాద్ నుంచి ఏటూర్ నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మొన్నటి వరకు వరద ముంపులో ఉన్న ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు ఇప్పుడు ఏకంగా బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరంగల్ నుంచి ఏటూర్‌నాగారాన్ని కలుపుతూ ఉండే జాతీయ రహదారి 163 వంతెన తెగి కొట్టుకుపోయింది.
రెండ్రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. దీనికి తోడు వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పస్రా -ఏటూరునాగారం మధ్యలో ఉన్న జలగటంచువాగు ప్రవాహానికి ఏకంగా కల్వర్టులు ధ్వంసమయ్యాయి. రెండ్రోజుల వర్షానికే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వాగులోని వరదనీరు ఉధృతానికి జాతీయ రహదారి దెబ్బతినడంతో రాకపోకలు నిలిపివేశారు. దీంతో వరంగల్, హన్మకొండ నుంచి ఏటూరు నాగారం వెళ్లే బస్సులు ములుగు, పస్రా మీదుగా కాకుండా పస్రా-తాడ్వాయిలో మేడారం మీదుగా నడుస్తున్నాయి.
పూర్తిగా ధ్వంసమైన జాతీయ రహదారి దగ్గర మరమ్మతులు చేపట్టడానికి కూడా అవకాశం లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా అధికారులు సైతం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏటూరునాగారం నుంచి వరంగల్, హన్మకొండ, హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం ఇదే కావడంతో ఏటూర్ నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, తాడ్వాయి. వెంకటాపూర్, వాజేడు, మంగపేట, రాజుపేట మండలాల నుంచి వేలాది మంది తమ తమ ప్రయాణాల్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జాతీయ రహదారి పూర్తిగా సుమారు 50 అడుగుల దూరం వరకు దెబ్బతినడంతో కనీసం చిన్న వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పనులు, ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసులు, చికిత్స నిమిత్తం వరంగల్, హైదరాబాద్‌కు తీసుకెళ్లాలంటే కూడా ఇదే ప్రధాన మార్గం కావడంతో జనం ఆందోళన చెందుతున్నారు. మరో 48గంటల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తూ వరద పెరిగితే సుమారు 50ఏజెన్సీ గ్రామాలతో పాటు 10-15 మండలాలకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్తంభించడమే కాకుండా బాహ్యసంబంధాలు తెగిపోతాయని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.