స్వతంత్ర వెబ్ డెస్క్: నేటి నుంచి టీమిండియా ఆతిథ్య జట్టుతో వన్డే సిరీస్‌లో తలపడనుంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల కోసం కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత్ టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు వన్డే ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై కాలేకపోయిన కరేబియన్లు ఈ వన్డేలో భారత్‌పై విజయం సాధించి తామేంటో మళ్లీ క్రికెట్ ప్రపంచానికి తెలియజేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తొలి వన్డే బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతుంది.
అయితే గత 17 ఏళ్లలో భారత్‌తో జరిగిన వన్డే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వెస్టిండీస్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 1983 మార్చి 9న జరిగిన తొలి భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ నుంచి ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య మొత్తం 23 సిరీస్‌లు జరిగాయి. 1983 నుంచి 1989 వరకు కరేబియన్ టీమ్ మాత్రమే వరుసగా 5 వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. ఆ తర్వాత తొలిసారిగా 1994లో భారత్.. వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత గెలుపోటముల పరంపర సాగిన క్రమంలో భారత్‌ను వెస్టిండీస్ చివరిసారిగా 2006లో ఓడించింది. అదే సంవత్సరం చివర్లో విండీస్‌తో మళ్లీ జరిగిన వన్డే సిరీస్ మొదలు ఇప్పటి వరకు మొత్తం 12 సిరీస్‌ల్లో భారత జట్టు వరుసగా గెలిచింది. ఇది వన్డే క్రికెట్‌లో ఓ ప్రపంచ రికార్డ్ కావడం కూడా విశేషం. అలాగే ఇరు జట్ల మధ్య మొత్తం 139 వన్డేలు జరగ్గా.. అందులో భారత్ 70, విండీస్ 63 గెలిచాయి. మరో 2 డ్రా కాగా మరో 4 మ్యాచ్‌లు ఫలితం లేకుండానే ముగిశాయి.