రంగస్థలంపై తన ప్రతిభను చాటుకుని ఇప్పుడిప్పడే వెండి తెరకు పరిచయం అవుతున్న నటుడు దాసరి తిరుపతి నాయుడు. ఉత్తరాంధ్రలో పేరెన్నికగన్న రంగస్థల కళాకారుడు దాసరి అప్పలస్వామి కుమారుడైన దాసరి తిరుపతి నాయుడు… తన తండ్రి నుంచి నటనను పుణికిపుచ్చుకుని… “తండ్రిని మించిన తనయుడి”గా పేరు గడించుకున్నారు. “మోహినీ భస్మాసుర” నాటకంలో భస్మాసుర పాత్రకు గాను “ఉత్తమ నటుడు”గా నంది అవార్డును దక్కించుకున్నారు. ఉపాధ్యాయుడిగా మూడు “పీజీ”లు చేసి, ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసిన తిరుపతి నాయుడు… ఉద్యోగ విరమణ అనంతరం సినిమాపై ఉన్న పిచ్చితో హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని… ఇకపై సినిమానే తన జీవితమని నిర్ణయించుకున్నారు.
విజయనగరం జిల్లా, బాడంగి మండలం, గొల్లాది గ్రామానికి చెందిన తిరుపతి నాయుడు… “కృష్ణుడు, అర్జునుడు, గయుడు, హరిశ్చంద్రుడు, జరాసంధుడు, భస్మాసురుడు అగ్నిద్యోతనుడు” వంటి పౌరాణిక పాత్రలతోపాటు… సాంఘిక పాత్రలల్లోనూ నటించారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలకు భంగం వాటిల్లనివ్వకుండా… “ఆ ముగ్గురు, మన్మధరెడ్డి, జనఘోష, అమృతభూమి, వాడు ఎవడు, రహస్యం, సీత, సర్కారువారి పాట” వంటి చిత్రాల్లో నటించి పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కంట్లో పడ్డారు!.
ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించిన “మార్కెట్‌లో ప్రజాస్వామ్యం” చిత్రంలో పారిశ్రామికవేత్తగా నటించారు. ఆ చిత్రంలో తిరుపతి నాయుడు నటనకు ముగ్ధుడైన ఆర్ నారాయణస్వామి… తన తదుపరి చిత్రం “యూనివర్సిటీ”లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రనిచ్చి… తెలుగు సినిమా రంగానికి ఒక మంచి నటుడిని అందించారు. నిడివితో నిమిత్తం లేకుండా… పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోకుండా… నటుడిగా రాణించాలనుకుంటున్న “దాసరి తిరుపతి నాయుడు”ని 9441712688 నంబర్‌లో సంప్రదించవచ్చు.