స్వతంత్ర వెబ్ డెస్క్: పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత చాలా డీలా పడిపోయాడు. ఒకరకంగా ఆయన అసలు ఎక్కడ ఉంటున్నాడో? ఏం చేస్తున్నాడో? కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ తన సోదరుడు పెట్ల గణేష్ ఇంట పూజా కార్యక్రమాల్లో కనిపించాడు. ఇక అప్పుడే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పోతినేని రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నాలుగేళ్ల కిందట వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. రామ్ ను సరికొత్త పాత్రలో చూపించిన జగన్.. వరుస ఫ్లాపుల తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. నిర్మాత కూడా కావడంతో ఆయనకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో జగన్ మళ్లీ రామ్ ను నమ్ముకున్నారు. అతనితో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు. దానికి ‘డబుల్ ఇస్మార్ట్’ అని టైటిల్ కూడా పెట్టారు.
తాజాగా సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తం షాట్‌కు సహ నిర్మాత చార్మీ కౌర్ క్లాప్ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘డబుల్ ఎంటర్ టైన్మెంట్, డబుల్ యాక్షన్, డబుల్ మ్యాడ్ నెస్ తో మేం మళ్లీ వచ్చేశాం. డబుల్ ఇస్మార్ట్ మోడ్ ఆన్’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సీక్వెల్ సినిమాను కూడా పూరీ స్వీయ నిర్మాణంలో చార్మీతో కలిసి రూపొందిస్తున్నారు. సీక్వెల్‌లో రామ్‌కు జోడీగా మీనాక్షీ చౌదరి నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో నటించిన స్కంధ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది.