స్వతంత్ర వెబ్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. కెనడాలోని కాల్గరీలో జరుగుతున్న కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సెమీఫైనల్లో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లో భారత వెటరన్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ నంబర్ వన్ అకానె యమగుచి చేతిలో ఓటమిని చవిచూసింది. ప్రస్తుతం 15వ ర్యాంక్‌లో ఉన్న సింధు 14-21, 15-21తో వరుస గేమ్‌లలో ఓడిపోయింది. సింగపూర్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లో ఓడిన తర్వాత యమగూచిపై భారత షట్లర్ సింధుకి ఇది వరుసగా రెండో ఓటమి.
ఇక మరోవైపు.. భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ కెనడా ఓపెన్‌లో తన అద్భుత ప్రదర్శనను కొనసాగించి ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించాడు. దాదాపు ఏడాది కాలంలో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌లో సేన్ కనిపించడం ఇదే తొలిసారి. ఆగస్టు 2022లో కామన్వెల్త్ గేమ్స్‌లో అతని చివరి ఫైనల్. ఇక అతను ఫైనల్లో అతను చైనాకు చెందిన లీ షిఫెంగ్ తో పోటీ పడనున్నాడు.