- గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు
- 64.33 శాతం పోలింగ్ నమోదు
- హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
- గుజరాత్‌లో మరోసారి బీజేపీదే అధికారం అన్న ఎగ్జిట్ పోల్స్
- హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ పోరు తప్పదన్న సర్వేలు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. హిమాచల్‌లో ఒకే దశలో నవంబర్ 12న ఎన్నికలు జరగ్గా.. గుజరాత్‌లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.
గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆమ్‌ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గద్వి, యువ నాయకులు హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మెవానీ, అల్పేష్ ఠాకూర్, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా వంటి ప్రముఖుల భవితవ్యం మరికాసేపట్లో తేలిపోనుంది. గుజరాత్‌లో అధికార బీజేపీ వరుసగా ఏడోసారి గెలిచి.. విజయభేరి మోగించాలని ఊవిళ్లూరుతోంది. గుజరాత్‌లో అధికారం చేపట్టేందుకు మెజార్టీ మార్క్ 92 సీట్లు అవసరం.
2017 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే… బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 77 సీట్లలో గెలిచాయి. బీటీపీకి రెండు, ఎన్సీపీకి ఒకటి, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే సమయానికి బీజేపీ సభ్యుల సంఖ్య 110కు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 60కి తగ్గింది. గత ఐదేళ్లలో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన 20 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 1995 నుంచి గుజరాత్‌లో బీజేపీనే అధికారంలో ఉంది.
గుజరాత్‌లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో ఆప్ ఉంటాయని చెప్పాయి. హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 68 స్థానాలకు నవంబర్ 12న పోలింగ్ జరిగింది. అక్కడ కూడా బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 1985 నుంచి వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి కూడా .. హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారం దక్కలేదు.