స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించే సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీల తాకిడి తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండనుండటంతో.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భాగ్యనగరంలో గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.
ఈ నెల 9న జరిగే లష్కర్ బోనాలు సందర్భంగా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తూ వస్తుందని అన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని జాగ్రత్తలు సక్రమంగా ఉన్నాయా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.
పోతురాజుల ఆటపాటలతో పాటు…అమ్మవారి రంగం వరకు అన్నీ ఘనంగానే జరుగుతాయి. రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల ముందునుంచే భద్రతపై రివ్యూ చేశారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానుండటంతో… మూడు వేల మంది సిబ్బందితో పాటుగా వందకు పైగా కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన అధికారులు… భక్తులకు ఇబ్బందులు కల్గకుండా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే అన్ని శాఖల సమన్వయంతో అమ్మవారి ఆశీస్సులతో బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని సిద్దం చేశారు. వాటర్ వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ సిద్దం చేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 ప్రాంతాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.