స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలందరికి ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదని, తద్వారా తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతికి పెద్దపీట వేసిందని సీఎం చెప్పారు. డప్పులు, మేళతాళాల నడుమ మహిళలు బోనమెత్తుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నారు. తరతరాల తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక అస్థిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందని చెప్పారు. బోనాల పండుగ ప్రారంభం నాడు వాన చినుకుల రూపంలో మనందరిమీద అమ్మవారు కరుణాకటాక్షాలు కురిపిస్తుండటం శుభసూచకమని సీఎం పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా కొనసాగుతూనే వుండాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని సీఎం కేసీఆర్ అమ్మవారిని ప్రార్థించారు.