మరో ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలిచేది ఎవరు? ఓడేది ఎవరు? అనేది ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. రెండు నెలల్లో తెలంగాణ ప్రజల నాడిని పసిగట్టే సర్వేని ‘స్వతంత్ర టీవీ’ చేసింది. అయితే ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలవారీగా సర్వే సాగింది. ఇందులో సెప్టెంబరు, నవంబరు రెండు నెలల్లో ఓటర్ల సర్వే జరిగింది. మొత్తం ఆరు ప్రశ్నలతో కూడిన సర్వే పత్రాన్ని ప్రజలకిచ్చి అడగడం జరిగింది. వాటిలో
1) మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా? 2) మీ ఊళ్లో అభివృద్ధి జరిగిందా?
3) ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు పనితీరు బాగుందా?
4) మీకు ప్రభుత్వ సాయం అందుతోందా?
5) తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని అనుకుంటున్నారా?
6) టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మీరు ఏ పార్టీకి ఓటేస్తారు?
ఇలా ప్రింట్ చేసిన కాగితాన్ని ప్రజలకిచ్చి అడగడం జరిగింది. వాళ్లందరూ చాలా ఉత్సాహంగా సర్వేలో పాల్గొన్నారు.
ఇలా 119 నియోజకవర్గాల్లో తెలంగాణ నాడిని బట్టి చూస్తే
టీఆర్ఎస్ 59
కాంగ్రెస్ 31
బీజేపీ 16
ఎంఐఎం 07
పోటాపోటీగా 06 స్థానాల్లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
అయితే సంవత్సరం తర్వాత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రజల నాడిని బట్టి చూసి, మరి పార్టీలు ముందడుగు వేస్తాయా? లేక వెనుకబాటులోనే ఉంటాయా? లేక వ్యూహాలు మార్చి ముందుకెళతాయా? లేక లుకలుకలతోనే కాలం గడిపేస్తాయా? లేక తిట్టుకుంటూనే కాలక్షేపం చేస్తాయా? లేక ఏమైనా మిలాఖత్ లు అవుతాయా ? అనేది తెలియాలంటే ఏడాది వరకు ఆగాల్సిందే. వేచి చూడాల్సిందే.