స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బోనాల పండుగను నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బోనాల పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయి. లంగర్ హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఈ మాసంలో ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లంను మట్టి లేదా రాగి కుండలలో తలపై ఉంచి, ఆలయానికి వెళ్లి కల్లు కొమ్మతో పాటు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు జూన్ 22న హైదరాబాద్ గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవం ప్రారంభం కాగా, జూలై 10న ఊరేగింపు నిర్వహించనున్నారు. పాతబస్తీలో బోనాల ఉత్సవం జూలై 16న ప్రారంభమవుతుందని, మరుసటి రోజు జూలై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు.