స్వతంత్ర వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయనకు మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేశ్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే పేర్నినాని తదితరులు ఘన స్వాగతం పలికారు.
టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాము నిర్మిస్తున్నవి ఇళ్లు కాదని.. కాలనీలని పునరుద్ఘాటించారు సీఎం జగన్. అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పిన మాటకు కట్టుబడి హామీని నెరవేర్చామన్నారు. జగనన్న కాలనీల్లో 16,240 కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయని వివరించారు. ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే 13,140 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు సీఎం జగన్. ఇప్పుడు వాటి రేటు 7 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇళ్లు కట్టడం పూర్తై ఆ రేటు 15 నుంచి 20 లక్షల రూపాయలు అవుతుందన్నారు.
16,601 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి టిడ్కో ఇళ్లు ఇచ్చామన్నారు జగన్. టీడీపీ మాత్రం ఆ ఇళ్ల పేరుతో 3 లక్షల రూపాయలు ప్రజలపై భారం వేసిందని గుర్తు చేశారు. ఇది ఇరవై ఏళ్లు ఉండేలా చేసిందన్నారు. ఇందులో చంద్రబాబు చేసిందేంటని ప్రశ్నించారు. చంద్రబాబు గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదని ఎద్దేవా చేశారు. గుడివాడలో పేదలకు చంద్రబాబు ఒక్క సెంటు స్థలం, ఇళ్లు కూడా ఇవ్వలేదన్న్నారు సీఎం జగన్. 8,659 ఇళ్లకు అదనంగా జూలై 7న మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో 30.68 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటి వెలువ రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.