స్వతంత్ర వెబ్ డెస్క్: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపర్ జోయ్’ తుఫాను మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గోవా, ముంబయికి పశ్చిమ నైరుతి దిశలో ఇది కేంద్రీకృతమై ఉంది. రాబోయే రెండ్రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదలనుంది. ఈ నేపథ్యంలో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 4వ తేదీకి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉంది. కానీ.. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ అనే తుపాను కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైంది. ఫలితంగా జూన్ లోనూ దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపాన్ ప్రభావంతో కేరళలోకి రేపు రుతుపవనాలు ప్రవేశించవచ్చని అంచనా వేసింది. తుపాను, అల్పపీడనంల ప్రభావంతో దక్షిణ ద్వీపకల్పంలో వర్షాలు కురుస్తాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడించారు. తుపాను తీవ్రత క్షీణించిన అనంతరం ద్వీపకల్పాన్ని దాటి రుతుపవనాలు వేగం పుంజుకుంటాయని తెలిపారు.