స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదస్థలిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు. కేంద్రం మంత్రులు, రైల్వే అధికారులతో ప్రమాదం ఎలా జరిగిందనే కారణంతో పాటు సహాయక చర్యలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా జరుగుతున్న సహాయక ఏర్పాట్లను పర్వవేక్షించారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు. అనంతరం కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోదీ పరామర్శించారు.
మరోవైపు ఈ ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో వెల్లడించింది. లూప్ లైన్‌లో ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ రైలు ఢీకొట్టిందని తెలిపింది. మెయిన్ లైన్‌పై వెళ్లేందుకే సిగ్నల్ ఇచ్చినా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పొరపాటున లూప్ లైన్‌లోకి వెళ్లి గూడ్స్ రైలును వేగంగా ఢీకొట్టడంతో బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయని పేర్కొంది. అదే సమయంలో బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని వెల్లడించింది. కాగా బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 290 మంది మరణించగా 900 మందికి పైగా గాయపడ్డారు.