స్వతంత్ర వెబ్ డెస్క్: మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య కాలంలో వీధి కుక్కలు ఒక రేంజిలో రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా అవి చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ లో కుక్కల దాడిలో మరో పసిప్రాణం ప్రాణాలు పోగొట్టుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లవాడు శవమై తేలాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కైసే ధుర్యోదన్, కైసే అనీషా దంపతులు గత కొంతకాలంగా మేడ్చల్ జిల్లా జగదీరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరు మహారాష్ట్ర నుంచి మూడేళ్ల కిందటే నగరానికి వలస వచ్చారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు మనోజ్ (11) ఇంటి ముందు పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు వెంబడించాయి. భయంతో పిల్లలంతా పరుగులు తీశారు. ఈ క్రమంలో బాలుడు మనోజ్ ప్రమాదవశాత్తు స్థానిక క్వారీ గుంతలో పడి మృతి చెందాడు. మనోజ్ మృతదేహాన్ని దగ్గర్లోని క్వారీ గుంత నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఈ ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.