స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకార మాధ్యమంగా నూతన పార్లమెంట్ భవనం నిలుస్తుందన్నారు. పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించిన ప్రధాని.. ఇది కొత్త పార్లమెంట్ కేవలం భవనం కాదని.. 140 కోట్ల ప్రజల ఆకాంక్ష, కలల ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం తర్వాత భారత్ కొత్త యాత్ర ప్రారంభించిందని…. ఎన్నో ఆటంకాలను దాటుతూ భారత్ అమృతోత్సవ వేళకు చేరుకుందన్నారు. ఈ సమయంలో యావత్తు భారత ప్రజలు మరింత పురోభివృద్ధి దిశగా పయనించాలన్నారు. అమృతోత్సవ కాలం దేశానికి కొత్త మార్గాన్ని సూచిస్తుందన్నారు. ముక్త భారత్ కోసం నవీన పంథా కావాలన్నారు. అన్ని హంగులతో కొలువుదీరిన కొత్త భవనం భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తుందని అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దపు కొత్త భారతదేశం ఉన్నత స్ఫూర్తితో నిండిన భారతదేశం.. బానిసత్వ ఆలోచనను వదిలివేస్తోందన్నారు.