స్వతంత్ర వెబ్ డెస్క్: ఈనెల 28 న నూతన పార్లమెంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారనే విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంట్‌ను రాష్ట్రపతి చేత ప్రారంభించకుండా ప్రధాని చేత చేయించడం ఏంటని విమర్శలు కూడా చేశాయి. పార్లమెంట్ ప్రారంభోత్సవం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపకపోవడంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ కూడా విమర్శకుల జాబితాలో చేరిపోయారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అనేది దేశం గర్వించదగిన సందర్భమని, ఇలాంటి సందర్భం రాజకీయ విభేదాలకు కారణంగా మారడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదో తనకు అర్థం కావడం లేదని కమల్‌హాసన్ అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన ఒక ప్రశ్న వేశారు. ‘మన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు రాకూడదు..? దయచేసి దీనిపై దేశానికి సమాధానం చెప్పండి’ అని కమల్ హాసన్ ప్రధానిని ప్రశ్నించారు. ఇంతటి చారిత్రక ఘట్టంలో దేశానికి అధినేతగా రాష్ట్రపతి పాల్గొంటే బాగుండేదని, కానీ ఆమెను ఆహ్వానించకూడదు అనడానికి తనకైతే సరైన కారణం కనిపించడం లేదని కమల్‌హాసన్ వ్యాఖ్యానించారు.