స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మే 27,28 తేదీల్లో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈసారి ఎన్టీఆర్ శతజయంతితో పాటు ఎన్నికల ఏడాది కావడంతో మహానాడును ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం వేదికగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరగనుంది. గోదావరి ప్రజల మన్ననలు పొందితే రాష్ట్రంలో అధికారం ఖాయమనే సెంటిమెంటుతో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందుకే మహానాడులో ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాను విడుదల చేసే అవకాశమున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో భాగంగా మహానాడు వేదికగా అధినేత చంద్రబాబు నిరుద్యోగులకు శుభవార్త చెప్పనున్నారని తెలిపారు. దీంతో మేనిఫెస్టో ముసాయిదా ప్రకటించనున్నారనే వాదన బయటకు వచ్చింది. అయితే ఈ మేనిఫెస్టో ప్రజల అకాంక్షలకు తగ్గటు ఉంటుందా? బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూర్చనుందా? యువతకు భరోసా ఇవ్వనుందా? అనే అంశాలపై అటు పార్టీ శ్రేణుల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి.