స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. ఆయన అరెస్ట్ చట్టవిరుద్ధమని ఆ దేశ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ అరెస్ట్ కోర్టు ధిక్కారణ కిందికే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఇమ్రాన్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘అల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో ఆర్మీ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్ ను మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అంతకుముందు గంటలోపు ఇమ్రాన్ ఖాన్ ను తమ ముందు హాజరుపరచాలని అధికారులకు పాక్ సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. దీంతో గత్యంతరం లేక సుప్రీం ముందు అతన్ని ప్రవేశపెట్టారు. రిజిస్టార్ అనుమతి లేకుండా కోర్టులోకి 90 నుంచి 100 మంది రేంజర్స్ ప్రవేశించి ఇమ్రాన్ ను అరెస్ట్ చేయడం హక్కులను ఉల్లంఘించడమే అంటూ హెచ్చరించింది. కాగా ఇమ్రాన్ అరెస్టుతో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.