స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం, వైఎస్సార్ షాదీ తోఫా పథకం నిధులను శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాల్లో నిధులు జమ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి మార్చి వరకు వివాహం చేసుకున్న 12,132 మంది కొత్త జంటల తల్లుల బ్యాంకు అకౌంట్ లో రూ.87.32 కోట్లు జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ఈ పథకం కింద గత ఆరు నెలల్లో 16 వేల మందికి పైగా లబ్ధిదారులకు మేలు చేశామని అన్నారు. వీరందరి ఖాతాల్లో మొత్తంగా రూ.125.50 కోట్లు జమ చేశామని అన్నారు. ఈ పథకానికి అర్హత పొందాలంటే.. వధువు ఖచ్చితంగా పదో తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి కాబట్టే ఈ రూల్ ని పెట్టామన్నారు. ఇప్పటికే పేద విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అందేజేస్తున్నామని అన్నారు.